Uttara Andra : ఉత్తరాంధ్ర ఈసారి ఎవరికి మొగ్గు. పొలిటికల్ సర్కిల్ లో ఇప్పుడు ఇదే చర్చ. ఇక్కడ ఎవరు ఎక్కువ స్థానాలు దక్కించుకుంటే.. వారే పవర్ లోకి వస్తారని ఒక సెంటిమెంట్ నడుస్తోంది. దీంతో అన్ని పార్టీలు ఫోకస్ పెంచాయి. రాష్ట్ర వ్యాప్తంగా 175 స్థానాలకుగాను.. ఉత్తరాంధ్రలో ఉన్నవి 34 నియోజకవర్గాలు. అంటే ఐదో వంతు ఇక్కడ ఉన్నాయన్న మాట. 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ స్వీప్ చేసినంత పనిచేసింది. 28 సీట్లు గెలిచింది. ఆరు నియోజకవర్గాలకు టీడీపీని పరిమితం చేసింది. 2024లో ఆ స్థాయి విజయాన్ని కొనసాగిస్తుందంటే సమాధానం దొరకడం లేదు. ఇక్కడ టీడీపీ బలం పుంజుకోవడమే అందుకు కారణం.
విశాఖ రాజధాని ప్రకటనతో ఉత్తరాంధ్ర నుంచి సానుకూలత వస్తుందని భావించిన జగన్ కు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ఝలక్ ఇచ్చారు. దీంతో ఇక్కడ టీడీపీ బలం పుంజుకున్నట్టు సంకేతాలు వచ్చాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి ఉత్తరాంధ్ర ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తోంది. ఒకటి రెండుసార్లు మాత్రమే ఓట్లు, సీట్లుపరంగా తగ్గాయి. దీంతో ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో పట్టు సాధించాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. పటిష్టమైన కేడర్, నాయకత్వం ఉండడంతో ఆ పార్టీ పైచేయి కోసం పోరాడుతోంది.
ఉత్తరాంధ్రపై లేటెస్ట్ సర్వే ఒకటి బయటకు వచ్చింది. వైసీపీ 48 శాతం, టీడీపీ 47 శాతం ఓటు షేర్ సాధించనుందన్నది సర్వే సారాంశం. ఈ లెక్కన వైసీపీకి 17, టీడీపీకి 15, జనసేనకు 2 సీట్లు వస్తాయని సర్వే తేల్చింది. అంటే 28 స్థానాలున్న వైసీపీ 11 స్థానాలను కోల్పోనుంది. 6 స్థానాలకే పరిమితమైన టీడీపీ మరో తొమ్మిది స్థానాలను తన ఖాతాలో వేయనుంది. అసలు ప్రాతినిధ్యమే లేని జనసేన రెండు చోట్ల విజయం సాధించనుంది. అయితే టీడీపీ, జనసేన మధ్య పొత్తులు కుదిరితే మాత్రం ఈ లెక్క మరింత తప్పనుంది. వైసీపీ సీట్లలో కోత పడనుంది.
గతం కంటే జనసేన గ్రాఫ్ పెరిగిన మాట వాస్తవం. ఉత్తరాంధ్రలో విశాఖ జిల్లాలో ఆ పార్టీకి పట్టు ఎక్కువ. అక్కడ టీడీపీ, జనసేన కూటమి కడితే దాదాపు స్వీప్ చేసినంత పనిచేస్తాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా జనసేన ప్రభావం ఉంటుంది. అటు ఇటుగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీకి జనసేన బలం తోడైతే ఏకపక్ష విజయం దక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే వైసీపీ, టీడీపీ మధ్యలో జనసేన కీరోల్ ప్లే చేయనుందన్న మాట.