Tirupati Stampede: తిరుపతి( Tirupati) తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఇంకా ప్రకంపనలు ఆగడం లేదు. తిరుమలలో స్వామివారి ఉత్తర ద్వార దర్శనాలకు సంబంధించి టోకెన్ల జారీ పంపిణీలో అపశృతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. 40 మంది వరకు మృత్యువాత చెందారు. యావత్ భారతదేశాన్ని కలచి వేసింది ఈ ఘటన. దీనిపై కూటమి ప్రభుత్వం సీరియస్ అయ్యింది. సీఎం చంద్రబాబు ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. టీటీడీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరిపై బదిలీ వేటు వేశారు. మరికొందరిపై చర్యలు తీసుకునేందుకు నిర్ణయించారు. ఇంకోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యులతో పాటు ఈవో, అడిషనల్ ఈవో సైతం క్షమాపణలు చెప్పాల్సిందేనని తేల్చి చెప్పారు. మరోవైపు మృతుల కుటుంబాలను టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎక్స్ గ్రేషియా చెక్కులు అందజేశారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం కల్పించనున్నట్లు ప్రకటించారు. అయినా సరే ఈ ఘటనపై వైసీపీ నేతలు విరుచుకుపడుతూనే ఉన్నారు. తాజాగా వైసీపీ అధినేత జగన్ స్పందించారు.
* ఎక్స్ వేదికగా స్పందించిన జగన్
సోషల్ మీడియాలో( social media) ఎక్స్ వేదికగా జగన్ స్పందించారు. మృతుల కుటుంబాల పట్ల ప్రభుత్వం అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తోందని తప్పు పట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకోవడం విషయంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గంగా ఉందన్నారు. ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు చిత్తూరు జిల్లా యంత్రాంగాన్ని కుప్పంలో తన ఆధీనంలో పెట్టుకున్నారని తప్పుపట్టారు జగన్. ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీటీడీ చైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కానీ చర్యలు తీసుకోవడంలో ఉదాసీనంగా వ్యవహరించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు జగన్. చర్యలు తీసుకోవడం వెనుక వివక్ష చూపడం దారుణమన్నారు. బదిలీలతో సరిపెట్టడం తగదన్నారు. జైల్లో పెట్టాల్సిన కేసులను తప్పించి.. తూతూ మంత్రంగా నమోదు చేయడం కూడా పలు అనుమానాలకు తావిస్తోందన్నారు జగన్.
* పవన్ వి రాజకీయ డ్రామాలు
మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జగన్. ప్రభుత్వం వైపు అలసత్వం ఉన్న చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్నారని.. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణ చెబితే చాలు అన్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తూతూ మంత్రపు చర్యలను పెద్ద దండనగా చిత్రీకరిస్తుంటే.. డిప్యూటీ సీఎం పవన్ మాత్రం క్షమాపణ చెప్పాలంటూ మరో రాజకీయ డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు జగన్. ఇంతకంటే దిగజారుడుతనం ఉంటుందా? అని ప్రశ్నించారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన దేవస్థానంలో ఆరుగురు మృత్యువాత పడితే.. ప్రాయశ్చిత్తంగా క్షమాపణ చెప్తే సరిపోతుందా అంటూ పవన్ కళ్యాణ్ పై జగన్ విరుచుకుపడ్డారు. భక్తుల మరణానికి కారకులైన వారికి ఇట్టే విడిచి పెడతారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
* ప్రచారాస్త్రంగా మార్చుకుంటున్న వైసిపి తిరుపతిలో( Tirupati) తొక్కిసలాట ఘటనను వైసీపీ సులువుగా విడిచి పెట్టే అవకాశం కనిపించడం లేదు. లడ్డు వివాదానికి సంబంధించి వైసీపీని అన్ని విధాలా ఇరుకున పెట్టింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఈ తొక్కిసలాట ఘటనలో కూటమి ప్రభుత్వం అడ్డంగా బుక్కైంది. అంత ఈజీగా విడిచి పెట్టేందుకు వైసిపి అంగీకరించడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఘటనకు సంబంధించి కూటమి ప్రభుత్వాన్ని బాధ్యులుగా చేయడానికి వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ అంశంతోనే ప్రజల్లోకి బలంగా వెళ్లాలని భావిస్తోంది.