CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత గతేడాది అధికారంలోకి వచ్చింది. పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అనేక హామీలు హస్తం పార్టీని అధికారంలోకి తెచ్చాయి. 2023, డిసెంబర్ 7న రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. 2024, డిసెంబర్ 7 నాటికి ఏడాది పాలన పూర్తయింది. ఈ ఏడాదిలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన కొన్ని హామీలు నెరవేర్చారు. అనేక హామీలు పెండింగ్‌లోనే ఉన్నాయ. ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఏడాది పాలనతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం రేవంత్‌రెడ్డి సర్వే చేయించారు. ఈ సర్వేలో బీజేపీ, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపైనా ప్రజలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. సర్వేలో షాకింగ్ ఫలితాలు వచ్చినట్లు సమాచారం.
మూడు పార్టీలపై సర్వే..
ఎన్నికలు జరిగి ఏడాది పూర్తయిన నేపథ్యంలో తెలంగాణలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, మరో విపక్ష పార్టీ బీజేపీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు పలు సర్వేలు జరిపినట్లు సమాచారం. నియోజకవర్గాల వారీగా పార్టీల బలాబలాలు, అక్కడి సిటిటంగ్ ఎమ్మెల్యేల పనితీరుపై ఈ సందర్భంగా ఆరా తీసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేల గ్రాఫ్ తగ్గిందా… పెరిగిందా… తగ్గితే ఎందుకు తగ్గింది..సిట్టింగ్ ఎమ్మెల్యే గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు.. ఎమ్మెల్యే ప్రజలకు ఏమేరకు అందుబాటులో ఉంటున్నారు. అనే వివరాలు ఆరా తీసినట్లు తెలిసింది. సర్వే రిపోర్టు ఆధారంగా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయడంపై సీఎం దృష్టిపెట్టినట్లు సమాచారం.
బీజేపీపై తీవ్ర వ్యతిరేకత..
సీఎం సర్వేలో తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ గణనీయంగా పడిపోయినట్లు తెలిసింది. ఏడు నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ స్థానాలు గెలిచింది. దీంతో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం కమలం పార్టీ అని అంతా భావించారు. కానీ, ఆ పార్టీ నాయకులు ప్రెస్‌మీట్‌లకే పరిమితం అవుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం నిర్వహించిన సర్వేలో బీజేపీ గ్రాఫ్ గణనీయంగా పడిపోయినట్లు వెల్లడైందని సమాచార.ం ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచిన 8 పార్లమెంట్‌నియోజకవర్గాల్లోనూ చాలా బలహీనంగా ఉందని తెలిసింది. కొన్నిచోట్ల ఆ పార్టీ ఉనికే లేదని ప్రజలు తెలిపినట్లు సమాచారం. ఇక 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలపైనా గతంలో ఉన్న పాజిటివ్ ఇప్పుడు లేదని సర్వేలో గుర్తించినట్లు తెలుస్తోంది.
కేసీఆర్‌పై వ్యతిరేకత..
ఇక సర్వేలో సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌పై ప్రజాభిప్రాయం సేకరించినట్టు తెలిసింది. ఈ సర్వేలో కేసీఆర్‌పై ఇంకా ప్రజల్లో వ్యతిరేకత తగ్గలేదని సర్వేలో గుర్తించినట్లు సమాచారం. ఇందుకు రెండు ప్రధాన కారణాలను సర్వేలో గుర్తించినట్లు తెలిసింది. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనను ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకపోవడం, విపక్ష హోదాలో కేసీఆర్ ప్రజలకు దూరంగా ఉండడం కారణంగానే కేసీఆర్‌పై వ్యతిరేకత తొలగనట్లు సమాచారం. ఇక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు మినహా మిగతా ఎమ్మెల్యేల పనితీరుపై వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలో తేలింది. అధికారంలో లేకపోయినా ఎమ్మెల్యే హంగు ఆర్భాటాలు తగ్గకపోవడం ఇందుకు కారణమని సమాచారం.
కాంగ్రెస్‌లో..
ఇక అధికార కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేలు ఉండగా, అందులో పది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులపై వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలో గుర్తించారు. నెగెటివ్ జాబితాలో ఉన్న ఇద్దరు మంత్రులపై వ్యతిరేకతకు వారి అనుచరులు, బంధవుల తీరే కారణమని గుర్తించారు. ఇక వ్యతిరేకత ఉన్న పది మంది ఎమ్మెల్యేలో ఇద్దరు సీనియర్లు కూడా ఉన్నట్లు సమాచారం. నియోజకవర్గాల్లో రియల్ దందాలు, సన్నిహితులు, బంధువుల పెత్తనం ప్రజలు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. కొందరు క్యాడర్‌ను పట్టించుకోకపోవడం కూడా వ్యతిరేకతకు కారణంగా తెలుస్తోంది. పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలను విడివిడిగా పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం.
బలసడిన రేవంత్..
ఇక తెలంగాణ సీఎం పనితీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు భావిస్తున్నారని సర్వేలో తేలింది. ఏడాది పాలనలో ఆయన గ్రాఫ్ పెరిగిందని సర్వేలో వెల్లడైంది. ఆయన పబ్లిక్ మీటింగ్స్‌లో మాట్లాడే భాష తీరు మారడం మంచిదని ప్రజలు భావిస్తున్నట్లు తెలిసింది. రుణమాఫీపై సంతృప్తిగా ఉన్న రైతులు, రైతు భరోసా ఆలస్యం కావడంపై నెగెటివ్‌గా ఉన్నట్లు సమాచారం. ఆసరా పింఛన్ల పెంపు కోసం కూడా ప్రజలు ఎదురు చూస్తున్నట్లు గుర్తించారు.