Tirupati Fake Ghee Case: తిరుమల తిరుపతి దేవస్థానానికి( Tirumala Tirupati Devasthanam) సంబంధించి అనేక వివాదాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో తిరుమల లడ్డులో కల్తీ జరిగింది అన్నది ప్రధాన ఆరోపణ. దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీట్ కాకుండా.. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సిబిఐ దర్యాప్తు జరపాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సిబిఐ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడిన దర్యాప్తు బృందాన్ని నియమించింది సుప్రీంకోర్టు. ప్రస్తుతం దాని విచారణ శరవేగంగా కొనసాగుతోంది. అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు జంతు కొవ్వుతో నెయ్యి కలిపారు అన్న దానికంటే.. ఏదో ఒక విధంగా కల్తీ జరిగిందన్న అంశం బయటకు వచ్చింది. వైసిపి ఐదేళ్ల కాలంలో నెయ్యి నాణ్యత తగ్గిందని దర్యాప్తులో తేలింది. దీంతో కేసు విచారణ వేగవంతం అయింది. అదే సమయంలో తిరుపతి పరకామణిలో చోరీకి సంబంధించి విచారణ కూడా చాలా వేగంగా సాగుతోంది. ఈ రెండు విచారణల్లోనూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దోషిగా నిలబడే అవకాశం ఉంది.
సిట్ ఎదుటకు వైవి సుబ్బారెడ్డి..
లడ్డు వివాదానికి సంబంధించి టిటిడి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వై వి సుబ్బారెడ్డి కి ( Yv Subba Reddy )నోటీసు ఇచ్చింది ప్రత్యేక దర్యాప్తు బృందం. రెండు రోజుల్లో ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఆయన వద్ద పీఏగా పనిచేసిన అప్పన్న ద్వారా నెయ్యి సరఫరా చేసే సంస్థల నుంచి భారీగా నగదు లావాదేవీలు జరిగాయని ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించింది. అవన్నీ వైవి సుబ్బారెడ్డి కి చేరవేసినట్లు అనుమానం వ్యక్తం చేసింది. అందుకే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డిని విచారణకు పిలిపించి దానిపై ప్రశ్నలు వేయనుంది. అయితే ప్రత్యేక దర్యాప్తు బృందం కచ్చితంగా నెయ్యిలో కల్తీ జరిగిందని నిర్ధారణకు వచ్చింది. అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు జంతు కొవ్వు కాకపోయినా.. ఇతరత్రా పదార్థాలు కల్తీ చేశారని మాత్రం తెలుస్తోంది. దీంతో దీనిపై మరింత పట్టు బిగించి అవకాశం ఉంది.
పరకామణిలో చోరీ కేసు..
అలాగే తిరుపతి పరకామణిలో ( parakkamani)చోరీ సంచలనం సృష్టించింది. అక్కడ తాత్కాలిక ప్రాతిపదికన నియమించిన ఓ ఉద్యోగి భారీగా నగదు దొంగిలించారని అభియోగం ఉంది. విదేశీ కరెన్సీని పెద్ద ఎత్తున చోరీ చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నియమించిన సదరు వ్యక్తి మూలంగా ఈ కేసులో మరింత పట్టు బిగించే అవకాశం ఉంది. అయితే ఈ రెండు కేసుల్లో విచారణ వేగవంతం కావడం చూస్తుంటే మాత్రం ప్రభుత్వానికి ప్రత్యేక ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ని ఇరకాటంలో పెట్టేందుకు ఒక రకమైన ప్రయత్నాలు ప్రారంభమైనట్లు సమాచారం. మున్ముందు ఈ కేసుల్లో పోలీసులతో పాటు విచారణ అధికారులు కీలక అడుగులు వేసే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా కేసు విచారణలను ముగించి.. నిజాలను నిగ్గు తేల్చాలన్న ప్రయత్నంలో ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?