Youtuber Builds Mini Bridge: సమాజంలో ఎంతోమంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. ఆర్థికంగా స్థితిమంతులుగా మారుతారు. గ్రామాల నుంచి వెళ్లి అభివృద్ధి సాధించిన వారు ఉంటారు. అటువంటివారు గ్రామాభివృద్ధికి ఎంతో కొంత కృషి చేయాలి. కానీ అలా చేస్తున్న వారు చాలా తక్కువ. ఎంత సంపాదించినా.. తోటి వారిని ఆదుకోవాలంటే మంచి మనసు ఉండాలి. అటువంటి మంచి మనసు చాటుకున్నారు ఓ యూట్యూబర్. తన సొంత డబ్బులతో గ్రామానికి వంతెన నిర్మించి.. గ్రామస్తులు ఏళ్ల నుంచి ఎదుర్కొంటున్న సమస్య నుంచి విముక్తి కల్పించాడు. దీంతో ఆ గ్రామస్తులు ఆ యువకుడ్ని అభినందనలతో ముంచేత్తుతున్నారు.
ఏడాది మొత్తం నీటి ప్రవాహం..
విజయనగరం జిల్లాలోని మూల బొడ్డవర పంచాయతీ పరిధిలో ఉంటుంది గాదెల్లోవ. ఆ గ్రామస్తులు బయట ప్రపంచానికి రావాలంటే ఒక గడ్డ దాటాల్సి ఉంటుంది. ఏడాదిలో పది నెలల పాటు ఆ గెడ్డలో నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. వంతెన నిర్మించాలని అధికారులను కోరినా ఫలితం లేకపోయింది. అత్యవసర సమయాల్లో వైద్య సేవలకు, ప్రతిరోజు విద్యాసంస్థలకు వెళ్లేందుకు విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో గ్రామస్తులే గడ్డపై ఒక పాత విద్యుత్ స్తంభాన్ని వేసి రాకపోకలు సాగించేవారు. ఎలాగోలా నెట్టుకొస్తూ వచ్చారు. కానీ ఇటీవల తుఫాన్ కు ఆ స్తంభం కూడా కొట్టుకుపోయింది. దీంతో గ్రామంలోకి రాకపోకలు నిలిచిపోయాయి. ఆ గ్రామస్తులకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. విద్యార్థులు విద్యాసంస్థలకు వెళ్లడం మానేశారు.
చలించిపోయిన యువకుడు..
అయితే గ్రామస్తులు తాము పడుతున్న బాధలను సోషల్ మీడియాలో విన్నవించారు. ఈ క్రమంలో వారి బాధను తెలుసుకున్నారు శృంగవరపుకోటకు చెందిన యూట్యూబర్ రామ్ సింగ్ నవీన్. ఎలాగైనా ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపించాలని భావించారు. హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న నవీన్ తన సొంత డబ్బులతో గెడ్డ పై వంతెన నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇందుకోసం లక్ష ఖర్చు చేసి బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించాడు. మూడు అడుగుల వెడల్పుతో వంతెన నిర్మించాడు. అయితే నవీన్ ప్రయత్నానికి గ్రామస్తుల సాయం తోడైంది. అందరి సహకారంతో కొన్ని రోజుల్లోనే గ్రామానికి వంతెన అందుబాటులోకి వచ్చింది. రెండు రోజుల కిందట ఆ వంతెనను ప్రారంభించి గ్రామస్తులకు అంకితం ఇచ్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.