Tirumala Parakamani Case: తిరుమల( Tirumala) పరకామణి చోరీ కేసు క్లైమాక్స్ కు చేరింది. డిసెంబర్ 2న న్యాయస్థానానికి నివేదించాల్సిన సమయం ఆసన్నమైంది. దీంతో సిట్ వేగవంతంగా దర్యాప్తు చేస్తోంది. టిటిడి మాజీ అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి ఈరోజు విచారణకు హాజరు కానున్నారు. తిరుమలలో మీడియా హడావిడి అధికంగా ఉండడంతో విజయవాడలో విచారణ చేపట్టేందుకు సిద్ధమయింది సిట్. ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి కి నోటీసులు అందించడంతో ఈరోజు ఆయన విచారణకు హాజరుకానున్నారు. దాదాపు ఈ కేసు విచారణ పూర్తయిందని తెలుస్తోంది. మధ్యలో ఫిర్యాదుదారుడు, ఆపై కేసు రాజీ చేసుకున్న సతీష్ కుమార్ అరెస్టు జరగడంతో కొద్దిపాటి జాప్యం జరిగింది. ఒకవైపు కేసు విచారణ కొనసాగుతుండగా మరోవైపు సతీష్ కుమార్ అనుమానాస్పద మృతిపై కూడా ఏపీ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. పరకామణి కేసులో అసలు విషయాలు బయటకు వస్తాయని తెలిసి సతీష్ కుమార్ ను హత్య చేశారా? లేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారా? అన్నది కూడా తెలియాల్సి ఉంది.
* అప్పట్లో అలా..
టిటిడి( Tirumala Tirupati Devasthanam) పరకామణిలో పనిచేసేవారు రవికుమార్ అనే ఉద్యోగి. అయితే ఆయన చేసేది చిన్న ఉద్యోగం కానీ భారీగా ఆస్తులు సంపాదించడం అనేది ఒక హాట్ టాపిక్. పరకామణిని కొల్లగొట్టి ఆస్తులు కొనుగోలు చేశారు అన్నది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. సరిగ్గా అటువంటి సమయంలోనే పరకామణిలో విదేశీ కరెన్సీ చోరీ చేసి అప్పటి అధికారిగా ఉన్న సతీష్ కుమార్ కు పట్టుబడ్డారు. సతీష్ కుమార్ స్వయంగా నిందితుడిని తిరుపతి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. పోలీసులకు కేసు నమోదు చేశారు. అయితే అదే కేసును కొద్ది రోజుల తర్వాత రాజీ చేసుకున్నారు సతీష్ కుమార్. ఆ కేసును వెనక్కి తీసుకోవడంతో లోక్ అదాలాత్ లు కొట్టివేశారు. కానీ ఇలా రాజీ చేసుకున్నందుకు గాను అప్పటి వైసిపి పెద్దలు రవికుమార్ ఆస్తులను కొంతవరకు స్వాధీనం చేసుకున్నారన్నది ఆరోపణ. పరకామణిలో చోరీకి సంబంధించి రవికుమార్ కొంత మొత్తం ఆస్తిని టీటీడీకి ఇవ్వగా.. మిగతా మొత్తాన్ని పెద్దలు కాజేసారన్నది ఆరోపణ. దానిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దర్యాప్తు ప్రారంభం అయింది.
* టీటీడీ పెద్ద సహకారంతో?
అప్పటి టీటీడీ పెద్దల ప్రమేయం లేకుండా.. ఈ కేసు రాజీ జరగదన్న వాదన ఉంది. అందుకే అప్పటి టీటీడీ పెద్దల చుట్టూ ఉచ్చు బిగుస్తూ వచ్చింది. అయితే ఈ కేసులో రాజీదారుడు, ఆపై ఫిర్యాదుదారుడుగా ఉన్న సతీష్ కుమార్( Satish Kumar) విచారణ ఒకసారి మాత్రమే జరిగింది. రెండోసారి విచారణకు హాజరయ్యే క్రమంలోనే సతీష్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందారు. అయితే డిసెంబర్ 2లోగా ఈ దర్యాప్తు విచారణ పూర్తి చేయాలని కోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు వైవి సుబ్బారెడ్డి విచారణకు విజయవాడలోని కార్యాలయానికి రానున్నారు. అప్పటి టీటీడీ అధ్యక్షుడు కావడంతోనే ఆయనను విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో టీటీడీ లడ్డు కేసులో సైతం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వైవి సుబ్బారెడ్డి. అయితే వైవి సుబ్బారెడ్డి అరెస్టు ఉంటుందని ప్రచారం సాగుతోంది. అది పరకామణి కేసులో కాకుండా.. తిరుమల లడ్డు వివాదంలో అని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..