https://oktelugu.com/

Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీ అరెస్టుకు ముహూర్తం ఫిక్స్.. చేసేది అప్పుడే!

వైసిపి హయాంలో వివాదాలకు చిరునామా వల్లభనేని వంశీ. టిడిపి నుంచి ఫిరాయించిన ఈయన చంద్రబాబు, లోకేష్ ల పై తీవ్ర స్థాయిలో వీరుచుకుపడేవారు. భువనేశ్వరి పై సైతం అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో యాక్షన్ ప్రారంభం అయింది.

Written By: Dharma, Updated On : November 20, 2024 1:07 pm
Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi

Follow us on

Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీ చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? అష్టదిగ్బంధనం చేస్తున్నారా? ప్రత్యేక వ్యూహం పన్నారా? వంశీ సరెండర్ అవ్వక తప్పని పరిస్థితా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గన్నవరంలో మట్టి, గ్రావెల్ తవ్వకాలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికీ 179 మంది పై కేసులు నమోదయ్యాయి. రూ.90.38 కోట్ల రికవరీకి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంట్లోనే వంశీకి ఉచ్చు బిగిసేలా కనిపిస్తోంది. విజిలెన్స్ రిపోర్టు రాగానే సిఐడి కి అప్పగిస్తారని.. ఆ తర్వాత మట్టి తవ్వకాలపై వంశీ మీద కేసు నమోదు తో పాటు అరెస్టు వరకు వ్యవహారం వెళుతుందన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు గన్నవరం నియోజకవర్గంలో వంశీ ముఖ్య అనుచరులుగా ఉన్న ఆరుగురిని అరెస్టు చేశారు పోలీసులు. గన్నవరం టిడిపి కార్యాలయం పై దాడి కేసులో ఏ 1 గా ఉన్నారు వల్లభనేని వంశీ. ఆయనను సైతం అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

* లోకేష్ హెచ్చరిక
ఇటీవల మండలిలో మంత్రి లోకేష్ తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుమించి ఆగ్రహం వ్యక్తం అయ్యింది. తన తల్లిని అవమానిస్తే ఊరుకోవాలా అని ఆయన ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో వదలి పెట్టబోనని హెచ్చరించారు.దీంతో వల్లభనేని వంశీ చేసిన కామెంట్స్ పై యాక్షన్ ఉంటుందని లోకేష్ సంకేతాలు ఇచ్చారు. నారా భువనేశ్వరి పై వల్లభనేని వంశీ తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశారు. అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున వివాదం నడిచింది. వంశీ కామెంట్స్ పై టిడిపి శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ ఎప్పుడు అరెస్ట్ అవుతారా? అని ఎక్కువ మంది టిడిపి శ్రేణులు ఆరా తీశాయి. ఎట్టి పరిస్థితుల్లో వల్లభనేని వంశీతోపాటు కొడాలి నానిని విడిచిపెట్టకూడదని టిడిపి శ్రేణులు కోరుకుంటున్నాయి. అయితే తాజాగా వంశీ చుట్టూ వ్యూహం పన్నుతున్నారు. వరుస కేసులు, అరెస్టులతో ఉక్కిరి బిక్కిరి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

* తెరపైకి నకిలీ పట్టాల కేసు
మరోవైపు వల్లభనేని వంశీకి నకిలీ ఇళ్ల పట్టాల అంశం భయపెడుతోంది. ఈ కేసుకు భయపడే టిడిపి నుంచి వైసీపీలోకి ఫిరాయించారు వంశి. ఇప్పుడు దాని పైనే ఒక ప్రైవేట్ వ్యక్తి కేసు వేశారు. దీంతో అక్కడ కూటమి ప్రభుత్వం ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం వంశీ ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. అప్పుడప్పుడు కేసుల విచారణకు గన్నవరం వస్తున్నారు. డిసెంబర్లో వరుసగా కోర్టు విచారణలకు ఆయన హాజరు కావాల్సి ఉంటుంది. ఆ సమయంలోనే ఆయన అరెస్టుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.