JanaSena: ఎక్కువ సీట్లు కంటే.. ఇచ్చిన సీట్లలో ఎక్కువ స్థానాలు గెలుచుకోవడమే మేలని పవన్ భావిస్తున్నారు. కానీ జన సైనికులు మాత్రం అధినేత తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంత తక్కువ సీట్లు తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇక జనసేన టికెట్లు ఆశించిన నాయకుల గురించి చెప్పనవసరం లేదు. టిక్కెట్లు దక్కని వారు బహిరంగంగానే కన్నీటి పర్యంతం అవుతున్నారు. అటు అధినేతకు చెప్పలేక.. ఇటు తాము సర్దుబాటు చేసుకోలేక సతమతమవుతున్నారు. జగ్గంపేట టికెట్ ఆశించిన పాఠంశెట్టి సూర్యచంద్ర అయితే ఏకంగా అమ్మవారి ఆలయంలోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని చెబుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
పొత్తులో భాగంగా జనసేనకు తెలుగుదేశం పార్టీ 24 అసెంబ్లీ స్థానాలను కేటాయించింది. తెలుగుదేశం పార్టీ 94 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో జగ్గంపేట టికెట్ను జ్యోతుల నెహ్రూకు టిడిపి ఖరారు చేసింది. పొత్తులో భాగంగా ఆస్థానం జనసేనకు దక్కుతుందని.. అక్కడ నుంచి పోటీ చేస్తానని పాఠంశెట్టి సూర్యచంద్ర ఆశ పెట్టుకున్నారు. జగ్గంపేటఎమ్మెల్యే అవుతానని నమ్మకంగా చెప్పేవారు. అయితే టికెట్ టిడిపికి కేటాయించడంతో నీరు గారి పోయారు. భావోద్వేగానికి గురై మీడియా సమావేశంలోనే కన్నీటి పర్యాంతమయ్యారు.
సూర్యచంద్ర తనకు టికెట్ రాకపోవడాన్ని నిరసిస్తూ కిర్లంపూడి మండలం గోనేడ నుంచి గోకవరం మండలం అచ్యుతాపురం వరకు పాదయాత్ర చేశారు. రబ్బరు చెప్పులు వేసుకునే తనలాంటి సామాన్యుడు టికెట్ ఆశించడం తగదేమో అని వాపోయారు. జనసేన కోసం పనిచేయడం తప్ప అని ప్రశ్నించారు. అంతటితో ఆగని ఆయన అచ్యుతాపురంలోని కనకదుర్గమ్మ ఆలయంలో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని ప్రకటించారు. కుటుంబ సభ్యులతో కలిసి నిరసన చేపట్టడానికి సూర్యచంద్ర సిద్ధపడటం సంచలనం రేకెత్తిస్తోంది. అయితే జనసేన తో పాటు టిడిపి నేతలు ఆయనను సముదాయించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.