YSRCP Leaders Crisis: ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చాలామంది నేతలు గుడ్ బై చెప్పారు. ఎన్నికల ముందు వచ్చిన వారు ఎలాగోలా ఛాన్స్ దక్కించుకున్నారు. కానీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత చాలామంది నేతలు చేరారు. కానీ అటువంటి వారికి ఎటువంటి పదవులు లేవు. కూటమి ప్రభుత్వంలో సరైన గౌరవం దక్కడం లేదు. స్థానికంగాను కూటమినేతలు వారిని కలుపుకెళ్లడం లేదు. కేవలం భవిష్యత్తు రాజకీయ అవసరాలు, హామీ మేరకు మాత్రమే వారు కూటమి పార్టీల్లో చేరారు. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజనతో తమకు పోటీకి అవకాశం దక్కుతుందని భావించి ఎక్కువమంది వైసీపీని వీడారు. అయితే ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన బిల్లును కేంద్రం ఉపసంహరించుకుంది. అదే సమయంలో కూటమి పార్టీల్లో సరైన గౌరవం దక్కడం లేదు. దీంతో వైసీపీని వీడి కూటమిలో చేరిన నేతలు ఆందోళనతో ఉన్నారు.
* ఒక వెలుగు వెలిగిన బాలినేని..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఆయన రాజశేఖర్ రెడ్డికి సమీప బంధువు కూడా. రాజశేఖర్ రెడ్డి తోడల్లుడు వైవి సుబ్బారెడ్డి. ఆయన బావ వరుస అవుతారు బాలినేని. అందుకే రాజశేఖర్ రెడ్డి ఆయనకు ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. చిన్న వయసులోనే అసెంబ్లీ టిక్కెట్ ఇప్పించి గెలిపించుకున్నారు. మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆ తర్వాత జగన్ వెంట అడుగులు వేసిన బాలినేనికి ఎనలేని ప్రాధాన్యం దక్కుతూ వచ్చింది. కానీ చిన్న చిన్న కారణాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమైన బాలినేని పవన్ కళ్యాణ్ కు దగ్గర అయ్యారు. జనసేనలో కూడా చేరారు. ఏడాదిన్నర దాటుతున్న ఎటువంటి గుర్తింపు లేదు ఆయనకు. భవిష్యత్తులో ఒంగోలు నుంచి పోటీ చేస్తామనే పరిస్థితి కూడా లేదు. నియోజకవర్గాల పునర్విభజన కూడా ఉండదని తేలిపోయింది. దీంతో ఏం చేయాలో బాలినేనికి పాలు పోవడం లేదు.
* ఆళ్ల నాని పరిస్థితి అదే..
మరో మాజీ మంత్రి ఆళ్ల నాని పరిస్థితి కూడా అలానే ఉంది. ఏలూరు నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఆయనకు డిప్యూటీ సీఎం ఇచ్చి మరి గౌరవించారు జగన్మోహన్ రెడ్డి. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అయితే ఆయన రాకను ఏలూరు టిడిపి క్యాడర్ వ్యతిరేకించింది. కేవలం పునర్విభజనతో ఏదో ఒక నియోజకవర్గంలో నుంచి పోటీ చేయవచ్చు అన్న ఆలోచనతోనే ఆయన టిడిపిలో చేరారు. కానీ ఇక్కడ పరిస్థితి బాగాలేదు. నియోజకవర్గాల పునర్విభజన జరిగే పని కాదు. ఆయన సైతం ఇప్పుడు డిఫెన్స్ లో పడిపోయినట్లు తెలుస్తోంది.
* మోపిదేవి వెంకటరమణ..
మరోవైపు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ పరిస్థితి కూడా అలానే ఉంది. రాజ్యసభ పదవి వదులుకొని మరి ఆయన టిడిపిలో చేరారు. నియోజకవర్గాల పునర్విభజన తో తన కుమారుడికి పోటీ చేసే అవకాశం దక్కుతుందని అంచనా వేసి ఆ నిర్ణయానికి వచ్చారు. కానీ ఇక్కడకు వచ్చాక టిడిపి శ్రేణులు ఆయనను పట్టించుకోవడం లేదు. పైగా రేపల్లెలో అనగానే సత్యప్రసాద్ పట్టు బిగిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తు భరోసా లేక సతమవుతున్నారు మోపిదేవి వెంకటరమణ. ఈ ముగ్గురు నేతలు అనవసరంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడిపోయామన్న బాధతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఏం చేయాలో వారికి పాలు పోవడం లేదు. అయితే కొద్ది రోజులు వేచి చూసి ఒక నిర్ణయానికి రావాలని భావిస్తున్నట్లు సమాచారం.