Vijaysai Reddy: ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ గా విజయసాయిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ కార్యక్రమానికి వైసీపీ కీలక నేతలు ముఖం చాటేసారు. దీంతో విజయసాయిరెడ్డి ఎంట్రీ చాలామంది వైసిపి నేతలకు ఇష్టం లేదని ప్రచారం ప్రారంభం అయింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతఉత్తరాంధ్ర సమన్వయకర్తగా విజయసాయిరెడ్డిని నియమించారు జగన్.అయితే ఆ సమయంలో మంత్రులు డమ్మీలుగా మారిపోయారని ప్రచారం సాగింది.ముఖ్యంగా విశాఖ జిల్లాకు చెందిన మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారన్న విమర్శ ఉంది. వారి వద్ద నుంచి విజయసాయిరెడ్డి పవర్స్ లాగేసేవారని.. మంత్రుల కంటే ఆయన మాటే ఎక్కువగా చెల్లుబాటు అయ్యేదని టాక్ నడిచింది. అప్పట్లో విజయసాయిరెడ్డి భారీగా భూదందాలకు పాల్పడ్డారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.దీనిపై ఫిర్యాదులు వెళ్లడంతోనే అప్పట్లో విజయసాయిరెడ్డిని మార్చేశారు.ఆయన స్థానంలో జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని నియమించారు.అయితే ఆయన ప్లేస్ లోనే ఇప్పుడు విజయసాయిరెడ్డిని తేవడం ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.ఆయన రాకను ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.సరిగ్గా ఇదే సమయంలో విశాఖకు చెందిన మాజీ మంత్రి,మాజీ ఎమ్మెల్యే ఒకరు కనీసం విజయసాయిని కలిసేందుకు కూడా ముందుకు రాలేదు. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ అవుతోంది.వారే మాజీమంత్రి అవంతి శ్రీనివాసరావు,మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్.
* విభేదాలకు కారణం
గతంలో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా పనిచేసినప్పుడు విజయసాయిరెడ్డి.. వైసీపీ నేతల మధ్య విభేదాలకు కారణమయ్యారన్న ఆరోపణ ఉంది. చాలా నియోజకవర్గాల్లో వర్గ పోరుకు ఆయనే కారణమని ఫిర్యాదులు ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహించారన్న విమర్శ కూడా ఉంది. విశాఖలో తనకంటూ ఒక సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారన్న వార్తలు కూడా వచ్చాయి.ఈ క్రమంలో అప్పటి మంత్రి, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా పావులు కదిపారన్న ఆరోపణలు ఉన్నాయి. పేరుకే మంత్రి కానీ విశాఖ జిల్లాలో విజయసాయిరెడ్డి మాట చెల్లుబాటు కావడంతో అవంతి నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ గా నియమించడాన్ని అవంతి శ్రీనివాస్ వ్యతిరేకించినట్లు సమాచారం. అయినా సరే జగన్ పట్టు పట్టి ఆయననే నియమించడంతో.. అవంతి శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే విజయసాయిరెడ్డిని కలవడానికి కూడా ఇష్టపడడం లేదని సమాచారం.
* వాసుపల్లి గణేష్ ది అదే బాధ
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 23 స్థానాల్లో గెలిచింది. అందులో విశాఖ దక్షిణ నియోజకవర్గం ఒకటి. అక్కడ నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ ఎమ్మెల్యేగా గెలిచారు. కొద్ది రోజులకే పార్టీ ఫిరాయించారు. వైసీపీలోకి వెళ్లిపోయారు. 2024 ఎన్నికల్లో టికెట్ హామీ తోనే ఆయన వైసీపీలో చేరారు. కానీ గణేష్ కుమార్ కు వ్యతిరేకంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వేరే నేతను ప్రోత్సహించారు విజయసాయిరెడ్డి. తన ఓటమి కోసం ఎంతగానో ప్రయత్నించారు అన్నది గణేష్ కుమార్ అనుమానం.అందుకే ఆయన సైతం విజయసాయిరెడ్డికి స్వాగతం పలికేందుకు రాలేదని తెలుస్తోంది. ఈ ఇద్దరే కాదు వైసీపీలోని మెజారిటీ నేతలు విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రకు రాకను వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. అధినేత జగన్ తమపై బలంగా విజయసాయిని రుద్దుతున్నట్లు వీరు ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో మున్ముందు వైసీపీలో విభేదాలు బయటపడే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.