Janasena: ఏపీలో సంచలన విజయం సాధించింది జనసేన పార్టీ. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి డిజాస్టర్ ఫలితాలను సాధిస్తూ వచ్చింది. సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఎన్నికల్లో శత శాతం విజయాన్ని సాధించింది. దీంతో ఏపీ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా మారింది. వాస్తవానికి ఆ పార్టీ విషయంలో జరిగిన విషప్రచారం అంతా అంతా కాదు. అది ఒక పార్టీయేనా అన్నంతగా ప్రచారం నడిచింది. ఎన్నెన్నో అవమానాలు పడ్డారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. వాటన్నింటిని అధిగమించి సాలిడ్ విజయాన్ని అందుకున్నారు. తెలుగు నాట తిరుగులేని రాజకీయ శక్తిగా జనసేన ను నిలిపారు. ఈ క్రమంలో ఆ పార్టీ ప్రతి అడుగు సాహసమే. ప్రతికూల ఫలితాలను చవిచూసిన ఆ పార్టీ.. అనతి కాలంలోనే తిరుగులేని రాజకీయ శక్తిగా మారింది. ఏపీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించింది.
* తొలి ఎన్నికల్లో పోటీకి దూరంగా
2014 ఎన్నికల నాటికి జనసేన ఒక సామాన్య సంస్థగా ఆవిర్భవించింది. అప్పటికే ఎన్నికలు సమీపించడంతో రాష్ట్రంలో టిడిపి, కేంద్రంలో బిజెపికి మద్దతు తెలిపింది. ఆ పార్టీ మద్దతుకు అనుగుణంగా రెండు చోట్ల అనుకూల ప్రభుత్వాలు వచ్చాయి. అయినా సరే జనసేన ఒక సామాన్య పార్టీగా ప్రజల మధ్యకు వెళ్లేందుకు ప్రయత్నించింది. తాము మద్దతు తెలిపిన పార్టీలు అధికారంలోకి వచ్చిన ఎన్నడు దానిని సొంత అవసరాలకు ఉపయోగించుకోలేదు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగింది జనసేన. కనీస స్థాయిలో కూడా ఉనికి చాటుకోలేదు. దారుణ పరాజయాన్ని చవిచూసింది. అయినా సరే మొక్కవోని దీక్షతో గత ఐదేళ్లుగా ప్రజా సమస్యలపై పోరాటం చేసింది. టిడిపి తో పాటు బిజెపితో జతకట్టింది. కూటమిగా ముందుకు కదిలింది. వైసీపీకి దారుణంగా దెబ్బతీసింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించి తనకు తిరుగులేదని నిరూపించుకుంది. ఏపీలో ప్రభావవంతమైన రాజకీయ శక్తిగా నిలిచింది జనసేన.
* ప్లీనరీ వేడుకలకు సిద్ధం
అయితే తాజాగా జనసేన విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జనసేన ప్లీనరీని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో మార్చి 12 నుంచి మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దానికి చైర్మన్గా వ్యవహరిస్తున్న నాదెండ్ల మనోహర్ ఈ విషయాన్ని ప్రకటించారు. పార్టీ తిరుగులేని విజయం కనబరచడంతో ఈసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్నారు. జనసేన బలోపేతంతో పాటు పార్టీలో భారీగా చేరికలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.