YCP MLAs: జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy ) పై ఓ నలుగురు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి వైఖరి వారికి నచ్చడం లేదా? అసెంబ్లీకి హాజరు విషయంలో అధినేత తీరును వారు తప్పు పడుతున్నారా? అందుకే ఆ నలుగురు వేరే కుంపటి పెట్టుకొనున్నారా? అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలను ప్రస్తావించునున్నారా? పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈనెల 18న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి హాజరవుతారని వార్తలు వచ్చాయి. అయితే తనకు ప్రత్యేక హోదా ఇస్తే కానీ సభకు హాజరుకాని జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. మరోవైపు వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోవడంతో వారందరిపై వేటుపడుతోందన్న ప్రచారం సాగుతోంది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు అయితే త్వరలో పులివెందులకు ఉప ఎన్నిక రాబోతుందని తేల్చి చెప్పారు. అయితే ఎన్ని రకాల పరిస్థితులు ఎదురైనా సభకు వెళ్లకూడదని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయంతో విభేదిస్తూ ఓ నలుగురు ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం నడుస్తోంది.
* ప్రతిపక్ష హోదా డిమాండ్..
మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ తరఫున 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన ఆ పార్టీ కేవలం రెండంకెల స్థానాలకే పరిమితం అయింది. కనీసం ప్రతిపక్ష హోదా దక్కలేదు. అయితే సంఖ్యతో సంబంధం లేకుండా.. ఓటింగ్ శాతాన్ని పరిగణలోకి తీసుకొని తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి కోరారు. అందుకు స్పీకర్ నో చెప్పారు. ఇదే విషయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని చంద్రబాబుతో పాటు స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా కోరారు. కానీ జగన్మోహన్ రెడ్డి నుంచి ఆశించిన స్థాయిలో సానుకూలత రావడం లేదు. వైసీపీ ఎమ్మెల్యేలకు ఇది మింగుడు పడడం లేదు. చాలామంది కొత్తగా ఎన్నికైన వారు కూడా ఉన్నారు. అటువంటివారు శాసనసభలో అడుగు పెట్టాలని ఉత్సాహం చూపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి చాన్స్ ఇవ్వడం లేదు.
* నమ్మదగినది కొందరే.. రాయలసీమలో( Rayalaseema ) ఐదు చోట్ల గెలిచారు వైసీపీ ఎమ్మెల్యేలు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి గెలవగా.. అదే జిల్లాలో మరో ఇద్దరు గెలిచారు. కర్నూలు జిల్లాలో బోణీ కొట్టారు. చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి గెలిచారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి వెంట ఓ ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే నమ్మకంగా అడుగులు వేస్తున్నారు. మిగతా ఐదుగురు మాత్రం ఏ క్షణంలో ఏ పార్టీలో చేరుదామా అన్న ఆలోచనలో ఉన్నారు. కానీ కూటమి నుంచి సానుకూలత రావడం లేదు. ఇప్పటికే కూటమి 164 సీట్లలో అధికారంలో ఉంది. ఈ ఐదుగురిని చేర్చుకోవడం ద్వారా ఎటువంటి రాజకీయ ప్రయోజనం ఉండదు. ఒకవేళ ఈ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే ఆయా నియోజకవర్గాల్లో రాజకీయ విభేదాలు వస్తాయి. ఆపై బలహీనమైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత బలహీనపరిచామన్న విమర్శ ఉంటుంది. అందుకే వారి విషయంలో కూటమి నుంచి సానుకూలత రావడం. అందుకే ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు డిఫెన్స్ లో పడ్డారు.
* వేరే కుంపటి..
అయితే జగన్మోహన్ రెడ్డి విషయంలో కూటమి ( Alliance) కఠినంగా ఉంది. 60 రోజుల నిబంధన తెరపైకి తెచ్చి అనర్హత వేటు వేస్తే తమ పరిస్థితి ఏంటని కొత్తగా ఎన్నికైన నలుగురు ఎమ్మెల్యేలు ఆవేదనతో ఉన్నారు. అందుకే వారు ప్రత్యేక శిబిరంగా ఏర్పడి.. సమావేశాలకు హాజరవుతారని ప్రచారం నడుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గానే సభకు వచ్చి.. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తారని సమాచారం. అయితే ఇక్కడే ఒక లాజిక్ ఉంది. వారు సభకు వచ్చి ప్రజాసమస్యలు పరిష్కరిస్తే జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్ లో పడటం ఖాయం. సొంత పార్టీ ఎమ్మెల్యేలు సభకు వెళ్లి ప్రశ్నిస్తుంటే.. అధినేతగా ఉండి నువ్వేం చేస్తున్నావనే ప్రశ్న వస్తుంది. అందుకే ఆ నలుగురిని జగన్మోహన్ రెడ్డి కట్టడి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.