Tirumala Tirupati: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో మున్ముందు భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. అందుకే టీటీడీ అధికారులు రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. భారీగా భక్తులు తరలి రావడంతో స్వామివారి దర్శనాలకు సమయం పడుతోంది. సర్వదర్శనం టోకెన్లను పొందిన భక్తులకు దర్శనానికి 15 నుంచి 17 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే 81,224 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందులో 24,093 మంది తలనీలాలను సమర్పించారు. ఈ ఒక్క రోజే హుండీ ద్వారా రూ.4.35 కోట్ల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి సమకూరింది.
ప్రస్తుతం పదో తరగతి తో పాటు ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. మిగతా తరగతుల వారికి కూడా ఈ నెలలోనే పరీక్షలు పూర్తయ్యే అవకాశం ఉంది. అందుకే రద్దీ కొనసాగుతోంది. 21 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9న తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ. టీటీడీలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే రోజు వేలాదిమంది భక్తులు సమక్షంలో శ్రీవారి ఆలయంలో తెలుగు సంవత్సరాది ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో రేపు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆరోజు ఆలయం శుద్ధి చేస్తారు అర్చకులు. ఆనంద నిలయం, బంగారు వాకిలి, ఉపాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పై కప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులన్నింటినీ శుభ్రం చేస్తారు. ఆరోజు ఆలయంలో మూల విరాట్ ను వస్త్రంతో పూర్తిగా కప్పేస్తారు.
ఏటా నాలుగు సార్లు ఇలా చేస్తారు. ఉగాది, అణివార ఆస్థానం, శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా శుద్ధి చేసిన అనంతరం ఆలయ సంప్రోక్షణ చేసి స్వామివారి దర్శనాన్ని భక్తులకు కల్పిస్తారు. అయితే ఈ ఏడాది భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఆలయ శుద్ధి దృష్ట్యా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. వీఐపీ దర్శనానికి దరఖాస్తు చేసుకున్న వారు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.