Can Chandrababu win in Kuppam
Chandrababu Naidu: రాష్ట్రంలో కీలక నేతల ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో వారు ప్రచారం చేసింది చాలా తక్కువ. వారి బదులు కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులే ప్రచారం చేస్తుంటారు. కానీ వారి మెజారిటీ చూస్తే లక్ష దాటుతుంది. అయితే మొన్నటి వరకు మాజీ సీఎం చంద్రబాబుకు ఇదే పరిస్థితి ఉండేది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు. కానీ గత ఎన్నికల్లో ఉన్నట్టుండి మెజారిటీని తగ్గించేశారు. ఎప్పుడూ 70 వేలకు తగ్గని మెజారిటీ 30 వేలకు పడిపోయింది. పైగా తొలి రెండు రౌండ్ల లెక్కింపులో చంద్రబాబు వెనుకబడ్డారు. అప్పట్లో ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబుపై వైసీపీ నేతల ఫోకస్ కు అసలు కారణం అయ్యింది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కుప్పం పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబును ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ బాధ్యతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పచెప్పారు. ఆయన చంద్రబాబుకు ప్రత్యర్థికి మించి శత్రువు. అందుకే కుప్పం పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో చంద్రబాబుపై పోటీ చేసిన భరత్ కు ఎమ్మెల్సీ ని చేశారు. నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధుల వరద కురిపించారు. కుప్పంను మున్సిపాలిటీగా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసి లను ఏకపక్షంగా గెలిపించుకున్నారు. కుప్పం మున్సిపాలిటీని సైతం కైవసం చేసుకున్నారు. దీంతో చంద్రబాబును ఎలాగైనా ఓడించవచ్చని ఒక నిర్ణయానికి వచ్చారు. గత ఐదు సంవత్సరాలుగా వైసిపి చేసే ప్రతి ప్రయత్నం వెనుక చంద్రబాబు ఓడించాలన్న కసి ఉంది.
1983 నుంచి తెలుగుదేశం పార్టీకి కుప్పం నియోజకవర్గం కంచుకోట. ఇంతవరకు అక్కడ పార్టీకి ఓటమి లేదు. టిడిపి ఆవిర్భావం తర్వాత 1983, 1985 ఎన్నికల్లో రంగస్వామి నాయుడు టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చంద్రగిరి నియోజకవర్గంలో నుంచి పోటీ చేసిన చంద్రబాబు టిడిపి అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. దీంతో మామ స్థాపించిన టిడిపిలో చంద్రబాబు చేరారు. 1989లో కుప్పం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు టిడిపి అభ్యర్థిగా ప్రతి ఎన్నికల్లో పోటీ చేసి చంద్రబాబు గెలుపొందుతూనే ఉన్నారు.
గత ఎన్నికల్లో చంద్రబాబు కేవలం 30 వేల ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలుపొందగలిగారు. ఈ నియోజకవర్గంలో కమ్మ, రెడ్డి, శెట్టిబలిజ, మైనారిటీ, దళితుల ప్రాబల్యం ఎక్కువ. 1955లో ఈ నియోజకవర్గంలో ఏర్పడింది. మొత్తం ఓటర్ల సంఖ్య 2,23,306. కుప్పం నియోజకవర్గ ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ రెండుసార్లు, స్వతంత్రులు రెండుసార్లు, సిపిఐ ఒకసారి గెలుపొందింది. 1983 నుంచి టిడిపికి కంచుకోట గా మారింది.వరుసగా ఏడుసార్లు చంద్రబాబు ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అందుకే అక్కడ చంద్రబాబును దెబ్బతీసి రాజకీయంగా సమాధి చేయాలని జగన్ గట్టిగా డిసైడ్ అయ్యారు.
అయితే ఎట్టి పరిస్థితుల్లో వైసిపికి ఛాన్స్ ఇవ్వకూడదని చంద్రబాబు భావిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు తరచూ కుప్పం వెళ్తున్నారు. మొన్నటికి మొన్న ఇంటింటా ప్రచారం చేశారు. 2024 ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎమ్మెల్సీ కంచకర్ల శ్రీకాంత్ కుప్పం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. చంద్రబాబు వ్యూహాలను శ్రీకాంత్ అక్కడ పక్కాగా అమలు చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో బలహీనమైన ప్రాంతాల్లో.. బలం పుంజుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. కుప్పం పట్టణంలో చంద్రబాబు సొంతింటి నిర్మాణం కూడా చేస్తున్నారంటే.. ఏ స్థాయిలో అలెర్ట్ అయ్యారో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.