Nallari vs Peddireddy: సుదీర్ఘ విరామం తర్వాత మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల వైపు వచ్చారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. దీంతో అక్కడ పోరు ప్రతిష్టాత్మకంగా మారనుంది. పైగా అక్కడ వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి మరోసారి రంగంలోకి దిగారు. నల్లారి, పెద్దిరెడ్డి కుటుంబాల మధ్య దశాబ్దాల రాజకీయ వైరం కొనసాగుతోంది. మొన్నటి వరకు వైసిపి వైపు మొగ్గు కనిపిస్తున్నా.. కిరణ్ అభ్యర్థిగా మారడంతో పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. ఇక్కడ టఫ్ ఫైట్ తప్పదని సంకేతాలు వస్తున్నాయి.
కిరణ్ కుమార్ రెడ్డి ది సుదీర్ఘ రాజకీయ నేపథ్య కుటుంబం. ఆయన తండ్రి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ రోల్ పోషించారు. ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ 1989 నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. రోశయ్య అనంతరం ఏపీ సీఎం బాధ్యతలు తీసుకున్న కిరణ్.. ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీతో విభేదించారు. జై సమైక్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేశారు. సొంత నియోజకవర్గం పీలేరులో పోటీ చేసి 56,636 ఓట్లు సాధించారు. ఆ తరువాత కొంతకాలం రాజకీయాలకు దూరమయ్యారు. తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఏడాది బిజెపిలో చేరారు. పొత్తులో భాగంగా రాజంపేట పార్లమెంట్ స్థానం బిజెపికి దక్కడంతో ఆ పార్టీ అభ్యర్థిగా ఖరారయ్యారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో నల్లారి కుటుంబానికి దశాబ్దాల వైరం. ముందుగా చింతల రామచంద్రారెడ్డి కుటుంబంతో నల్లారి కుటుంబానికి పొసిగేది కాదు. తీవ్రంగా విభేదించుకుంటూ వచ్చారు. తరువాత ఆ వైరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంతో కొనసాగింది. 2010లో కిరణ్ అనూహ్యంగా సీఎం కావడంతో ఆయన ప్రాబల్యం పెంచుకున్నారు. కిరణ్ తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి తనకంటూ ఒక ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేశారు. రాష్ట్ర విభజన తరువాత తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే టిడిపిలోకి తమ్ముడు కిషోర్ వెళ్లడం కిరణ్ కు ఇష్టం లేదని ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే టిడిపి మద్దతుతో బిజెపి అభ్యర్థిగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. చిరకాల ప్రత్యర్థి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడే పోటీగా ఉండడంతో ఇక్కడ రాజకీయం రసవత్తరంగా మారనుంది.
రాజంపేట పార్లమెంట్ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో కిరణ్ సొంత నియోజకవర్గం పీలేరు ఉంది. అటు వైసిపి అభ్యర్థి మిధున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు కూడా ఉంది. మిగతా ఐదు నియోజకవర్గాల్లో సైతం పరిస్థితి నువ్వా నేనా అన్నట్టు ఉంది. పీలేరులో నల్లారి కుటుంబం పై సానుభూతి ఉంది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు పులివెందులకు ధీటుగా అభివృద్ధి చేశారు. అటు పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తిరుగులేదు. దీంతో పీలేరు, పుంగనూరులో వచ్చే మెజారిటీయే రాజంపేట లోక్సభ సీటు గెలుపోటములపై ప్రభావం చూపనుంది.అందుకే ఇక్కడ పోటీ ప్రతిష్టాత్మకంగా మారింది. ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి.