AP Elections 2024 : ఏపీ ఎన్నికల్లో ఆ 60 లక్షల మందే కీలకం.. వారు ఎటు మొగ్గితే వారిదే అధికారం!

మరి ఈ 60 లక్షల కుటుంబాలు ఎటువైపు మొగ్గుచూపాయనేది తెలియాలంటే జూన్‌ 4 వరకు వేచి ఉండాలి.

Written By: NARESH, Updated On : May 19, 2024 5:00 pm

AP Elections 2024

Follow us on

AP Elections 2024 : ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. 25 లోక్‌సభ స్థానాలతోపాటు, 175 అసెంబ్లీ స్థానాలకు ఒకేవిడతలో ఈసీ ఎన్నికలు నిర్వహించింది. మే 13న పోలింగ్‌ జరిగింది. రికార్డు స్థాయిలో 82 శాతం పోలింగ్‌ నమోదైంది. పోలింగ్‌ శాతం పెరగడంతో అది ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనమని విపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి లెక్కలు వేస్తోంది. పోటెత్తిన ఓటర్లు ప్రభుత్వానికి మద్దతుగా తరలి వచ్చారని వైసీపీ పేర్కొంటోంది. ఎవరి లెక్కలు ఎలా ఉన్నా.. ఆ 60 లక్షల మందే కీలకమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఎవరా 60 లక్షల మంది..
రాష్ట్రంలో పేద, ధనిక, మధ్య తరగతి ప్రజలు ఉన్నారు. ధనికులు విపక్ష కూటమి వైపు మొగ్గినట్లు, పేదలు వైపీసీ వైపు మొగ్గినట్లు పోలింగ్‌ సరళినిబట్టి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే మధ్య తరగతి ప్రజలు ఎటువైపు ఉన్నారనేది మాత్రం కీలకంగా మారింది. రాష్ట్రంలో 60 లక్షల మధ్య తరగతి కుటుంబాలు ఉన్నాయి. వీరు వైసీపీ సర్కార్‌ మళ్లీ కావాలనుకున్నారా లేక అధికార పార్టీని గద్దె దించాలని అనుకున్నారా అనేదే కీలకంగా మారనుంది.

మధ్య తరగతికి సంక్షేమ పథకాలు..
రాష్ట్రంలో పేదలతోపాటు, మధ్య తరగతి ప్రజలకు కూడా వైసీపీ సర్కార్‌ సంక్షేమ పథకాలు అందిస్తోంది. పార్టీలకు అతీతంగా ప్రజల ఆర్థిక స్థోమత ఆధారంగా నవరత్నాలు అందుతున్నాయి. ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, అమ్మ ఒడితోపాటు రైతు భరోసా, పెన్షన్లు, అనేక పథకాలు అందుతున్నాయి. వీరంతా తమకు ఐదేళ్లు మేలు జరిగిందని భావిస్తే వారు వైపీసీవైపు మొగ్గు చూపుతారని అంటున్నారు. అయితే ఈ పథకాలు చంద్రబాబు కూడా కొనసాగిస్తానని ప్రకటించారు. వాటి లబ్ధి పెంచుతామని కూడా మేనిఫెస్టోలో పేర్కొన్నారు. దీంతో మధ్య తరగతివారు పథకాలు కొనసాగుతాయి కాబట్టి అధికారం మార్చాలని భావిస్తే.. టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది.

మరి ఈ 60 లక్షల కుటుంబాలు ఎటువైపు మొగ్గుచూపాయనేది తెలియాలంటే జూన్‌ 4 వరకు వేచి ఉండాలి.