Chandrababu
Chandrababu: వయసు రీత్యా చంద్రబాబుకు ప్రస్తుతం 74 సంవత్సరాలు. మరి కొద్ది రోజుల్లో ఏపీ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి.. ఇవే తనకు చివరి ఎన్నికలని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. ఆరోగ్యపరంగా కూడా చంద్రబాబు నాయుడు అంత యాక్టివ్ గా లేరని ఇటీవల కోర్టుకు ఆయన తరఫు లాయర్ తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఆయన అరెస్టయి.. 50 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా ఆయన ఉన్నారు. అప్పుడు ఆయన అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. బెయిల్ మంజూరుకు సంబంధించి కోర్టుకు ఆయన తరఫు లాయర్లు పదేపదే కోర్టుకు అదే విషయాన్ని చెప్పారు. ఎట్టకేలకు కోర్టు స్పందించి ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరయిన తర్వాత చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల వరకు బయటకు రాలేదు. ఆ తర్వాత గుళ్ళు గోపురాలు తిరగడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా అధికారంలోకి వచ్చేంత సత్తా లేకపోవడంతో జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత బిజెపితోను పొత్తు కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఆ రెండు పార్టీలతో అంట కాగి ఎలాగోలా అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. కొంతకాలం తర్వాత ముఖ్యమంత్రి గా పని చేసిన తర్వాత తన కొడుకు లోకేష్ ను ముఖ్యమంత్రిని చేయాలని చంద్రబాబు అనుకుంటున్నట్టు తెలుస్తోంది.
ముందుగానే చెప్పినట్టు చంద్రబాబు వయసు ప్రస్తుతం 74 సంవత్సరాలు. ఆయన ఒకవేళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే.. పదవి కాలం పూర్తయ్యే నాటికి 79 సంవత్సరాలకు చేరుకుంటారు. ఆయనకున్న అనారోగ్య సమస్యల దృష్ట్యా అది అంత శ్రేయస్కరం కాదు. ఆయన మధుమేహంతో పాటు చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. అలాంటప్పుడు ఆయన ఆ వయసులో అంత యాక్టివ్ గా పని చేసే అవకాశం లేదు. పైగా ఆయనకు గుండె సంబంధిత సమస్యలు కూడా ఉన్నాయని అప్పట్లో ఆయన తరపు లాయర్లు కోర్టుకు విన్నవించారు. సో ఇలా ఆరోగ్యపరంగా చూసుకుంటే చంద్రబాబునాయుడు రెండు లేదా మూడు సంవత్సరాలకు యాక్టివ్ గా పని చేసే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..
ప్రస్తుత ఏపీ రాజకీయాల దృష్ట్యా చంద్రబాబునాయుడు కు ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో అధికారంలోకి వస్తేనే టిడిపికి పూర్వ వైభవం దక్కుతుంది. లేకుంటే ఆ పార్టీ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పైగా చంద్రబాబునాయుడు స్థాయిలో నడిపించే నాయకుడు టిడిపికి లేరు. లోకేష్ లో ఇంకా రాజకీయ పరిపక్వత రాలేదని సొంత పార్టీ నాయకులే అభిప్రాయపడుతుంటారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శమని వారు చెబుతున్నారు. ఇన్ని పరిణామాల నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు బిజెపి తో పాటు జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నారు. అందువల్లే అమిత్ షా, నరేంద్ర మోడీని కలుస్తున్నారు. టిడిపిలోని కొంతమంది నాయకులకు ఇది నచ్చకపోయినప్పటికీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా తప్పదని వారికి చంద్రబాబు నాయుడు సర్ది చెబుతున్నారు. మరి ఇన్ని రకాల పొత్తులకు పాల్పడుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడికి ఈసారి అధికారం దక్కుతుందా? లేక జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారా? అనే ప్రశ్నలకు కాలం గడిస్తే తప్ప సమాధానం లభించదు.