Congress Kaleshwaram Yatra: “మా పులి లోపల ఉంది. బయటికి వస్తే అంతే సంగతులు. మిమ్మల్ని, మీ పార్టీని ఒక ఆట ఆడుకుంటారు. ఆరు నెలల్లో మీ అధికారం పోవుడు ఖాయం” ఇవి ఇటీవల భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యల ఆధారంగా చాలామంది కెసిఆర్ బయటకు వస్తారని.. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒక ఆట ఆడుకుంటారని భావించారు. అనుకున్నట్టుగానే కెసిఆర్ చేతికర్ర సహాయంతో అసెంబ్లీకి వచ్చారు. స్పీకర్ ఎదుట ప్రమాణ స్వీకారం చేశారు. కానీ అప్పటినుంచి మళ్లీ ఆయన అందుబాటులో లేరు. నంది నగర్ లో తన నివాసంలో కొంతమంది భారత రాష్ట్ర సమితి నాయకులతో ఆయన భేటీ అయ్యారు. ఫిబ్రవరి 13న నల్లగొండలో నిర్వహించే సభను విజయవంతం చేయాలని వారిని కోరారు. అయితే కెసిఆర్ భేటీ నిర్వహించిన రెండు రోజుల తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కనీసం ఈ సమావేశానికైనా కేసీఆర్ వస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ ఈ సమావేశానికి కూడా ఆయన డుమ్మా కొట్టారు.
అప్పట్లో కేటీఆర్ కెసిఆర్ రాకను ఉద్దేశించి పులి అనే వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ ను కేటీఆర్ పులి అని వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. ఆయనను పట్టుకోవడానికి బోను కూడా సిద్ధం చేశామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అప్పట్లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకోవడంతో.. కేసీఆర్ ఎంట్రీ ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మరో విధంగా మారతాయని రాజకీయ విశ్లేషకులు భావించారు. అంతేకాదు కెసిఆర్ ఎంట్రీ గురించి అటు కేటీఆర్, ఇటు హరీష్ రావు కే జీఎఫ్ లెవెల్ లో ఎలివేషన్లు ఇవ్వడంతో చాలామందిలో అంచనాలు పెరిగిపోయాయి. కానీ వారందరి అంచనాలను తన గైర్హాజర్ తో కెసిఆర్ తలకిందులు చేశారు. చివరికి బడ్జెట్ సమావేశాలు కూడా రాకపోవడం కెసిఆర్ అభిమానులను నిరాశకు గురిచేసింది. శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఉభయసభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. మరి సోమవారం నాడైనా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? లేదా? అనేది అనుమానం గానే ఉంది.
వాస్తవానికి బడ్జెట్ సమావేశాలను రెండు రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అయితే కెసిఆర్ కృష్ణా నదిపై ప్రాజెక్టులను కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పగిస్తోందని ఆరోపిస్తూ నల్లగొండలో భారీ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కెసిఆర్ చేస్తున్న ప్లాన్ కు కౌంటర్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో కాలేశ్వరం యాత్రకు శ్రీకారం చుట్టారు. అది కూడా మంగళవారం నాడే అన్ని పార్టీల ఎమ్మెల్యేలను బస్సు యాత్ర ద్వారా అక్కడికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. వాస్తవానికి మంగళవారం కూడా శాసనసభకు సంబంధించి బడ్జెట్ సమావేశం ఉంది. కెసిఆర్ నల్లగొండలో సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో.. రేవంత్ రెడ్డి అత్యంత తెలివిగా భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఎంత దోచుకుంది అని చెప్పేందుకు ఎమ్మెల్యేలతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ యాత్రలో పాల్గొనాలని కెసిఆర్ కు ఆయన ఆహ్వానం కూడా అందించారు. ఈ బాధ్యతను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించారు. మరి ఇన్ని పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ కాలేశ్వరం యాత్రకు వస్తారా.. లేక నల్లగొండ సభలో పాల్గొంటారా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు సోమవారం నిర్వహించే బడ్జెట్ సమావేశానికి కేసీఆర్ హాజరుకావాలని భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు కోరుకుంటున్నారు.