Homeఎంటర్టైన్మెంట్Tatikonda Rajaiah: పాపం రాజయ్య.. రెంటికి చెడ్డ రేవడి అయ్యారా?

Tatikonda Rajaiah: పాపం రాజయ్య.. రెంటికి చెడ్డ రేవడి అయ్యారా?

Tatikonda Rajaiah: రాజకీయాలు అనేవి కలుషితమైపోవచ్చు గాక.. కానీ ఆ రాజకీయాలు చేసే నాయకులు కొద్దో గొప్పో విలువలు పాటించాలి. హుందా తనాన్ని కలిగి ఉండాలి. లేకుంటే మొదటికే మోసం వస్తుంది. అధికారాన్ని కలిగి ఉన్నామని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ప్రజల్లో చులకన కావడమే కాదు.. అన్ని రోజుల పాటు సంపాదించుకున్న రాజకీయ అనుభవం మట్టిలో కలిసిపోతుంది. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిని స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఎదుర్కొంటున్నారు.

మొన్నటిదాకా భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేగా, స్టేషన్ ఘన్ పూర్ ప్రాంత రాజకీయాలను శాసించిన రాజయ్య.. ఒక్కసారిగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. గతంలో వైద్యారోగ్య శాఖలో పనిచేసి.. కొన్ని కారణాలవల్ల పదవిని కోల్పోయారు. ఎప్పటికీ 2018 లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ఆయనకు టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచిన రాజయ్యను మంత్రివర్గంలో కి తీసుకోలేదు. అయితే రాజయ్య కూడా పెద్దగా దీనిపై బాధపడలేదు. అప్పట్లో అంటే ఎన్నికలకు ముందు సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలతో రాజయ్య మరోసారి వార్తల వ్యక్తియ్యారు. ఎన్నికలకు ముందు ఈ సంఘటన జరగడంతో భారత రాష్ట్ర సమితి ఒక్కసారిగా కుదుపునకు గురైంది. దీంతో నష్ట నివారణ చర్యలు చేపట్టింది. రాజయ్య తో సర్పంచ్ నవ్య కు క్షమాపణలు చెప్పించింది. ఇది ఇలా ఉండగానే దళిత బంధు పథకాన్ని రాజయ్య తన సోదరుడికి వర్తింపజేశారని.. కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నారని సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో మరోసారి రాజయ్య హాట్ టాపిక్ అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి అధిష్టానం ఆయనకు ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. ఆయనకు బదులుగా కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చింది. రాజయ్య రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకు రైతుబంధు సమావేశం అధ్యక్షుడిగా నియమించింది.

ఇక ఆ ఎన్నికల్లో తనకు టికెట్ రాకపోయినప్పటికీ రాజయ్య శ్రీహరి గెలుపు కోసం పనిచేశారు. ఎన్నికల్లో గెలిపించారు. శ్రీహరి గెలిచినప్పటికీ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలోకి రాకపోవడంతో ఒక్కసారిగా రాజయ్య ఆశలు అడియాసలయ్యాయి. అంతేకాదు అప్పట్లో రాజయ్యకు టికెట్ రానప్పుడు బోరున విలపించారు. ఆయన బాధ చూసి బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ నాయకుడు దామోదర రాజనర్సింహ స్పందించారు. రాజయ్యకు టికెట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. అయితే రాజయ్య దానిని సున్నితంగా తిరస్కరించారు. అప్పట్లో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని రాజయ్యకు బలమైన నమ్మకం ఉండేది. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజయ్య అంచనా తప్పడంతో ఒక్కసారిగా డీలా పడిపోయారు. ఎమ్మెల్యేగా అవకాశం దక్కకపోవడం, భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలో లేకపోవడంతో రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరాలి అని కీలక నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నట్టుగానే భారత రాష్ట్ర సమితి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలి అనుకుంటుండగానే ఆయనకు అనుకోని అవాంతరం వచ్చి పడింది. రాజయ్యను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ పార్టీకి చెందిన మహిళ నేతలు గాంధీభవన్ ఎదుట నిరసనకు దిగారు. వాస్తవానికి ఫిబ్రవరి 10న రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉండేది. అయితే సొంత పార్టీ కింద మహిళల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో రేవంత్ రెడ్డి రాజయ్య చేరిక విషయంలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని తెలుస్తోంది.. దీంతో రాజకీయ వర్గాల్లో హాట్ చర్చ నడుస్తోంది. అటు భారత రాష్ట్ర సమితిని వదిలేసి.. ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుని గాంధీభవన్ వైపు వస్తే.. ఇక్కడ కూడా తిరస్కారమే ఎదురవుతున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్నో సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న రాజయ్య రెంటికి చెడ్డ రేవడి అయిపోయారని వ్యాఖ్యానిస్తున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version