Jagan: వైఎస్ఆర్ కు.. జగన్ కు తేడా ఇదే.. అందుకే ఓడాడు

జగన్ చేసిన సంక్షేమానికి జనాలు జై కొట్టారు. సీట్లు తగ్గినా, భారీ ఓటమి ఎదురైనా.. వైసీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయి. కోటి 32 లక్షల మంది ఓటు వేశారు. కానీ దానిని మరిచిపోతున్నారు జగన్.

Written By: Dharma, Updated On : June 22, 2024 2:03 pm

Jagan

Follow us on

Jagan: ఓటమి నుంచి జగన్ గుణపాఠాలు నేర్చుకోవడం లేదా? వాస్తవాలను ఒప్పుకునే పరిస్థితిలో లేరా? తన తప్పిదాలను గుర్తించడం లేదా? అందుకే ఈవీఎంలపై నెపం పెడుతున్నారా? ఇప్పటికీ పార్టీ శ్రేణులను భ్రమల్లో ముంచుతున్నారా? వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు సింగిల్ డిజిట్ వస్తుందని చెప్పడం దేనికి సంకేతం? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. విశ్లేషకులు మాత్రం జగన్ తీరును తప్పుపడుతున్నారు. జగన్ వైఖరి మారాలని సూచిస్తున్నారు. తన తండ్రి మాదిరిగా సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయాలని చెప్పుకొస్తున్నారు.

జగన్ చేసిన సంక్షేమానికి జనాలు జై కొట్టారు. సీట్లు తగ్గినా, భారీ ఓటమి ఎదురైనా.. వైసీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయి. కోటి 32 లక్షల మంది ఓటు వేశారు. కానీ దానిని మరిచిపోతున్నారు జగన్. ఈ ఐదేళ్ల తన పాలనలో విస్మరించిన అంశాలే తన వైఫల్యానికి కారణమని గుర్తించలేకపోతున్నారు. అసలు పార్టీ పై పూర్తిస్థాయిలో పట్టు కోల్పోయారు. కేవలం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపైనే అజమాయిషీ చేశారు. గ్రామస్థాయి క్యాడర్ను గాలికి వదిలేసారు. అంత వలంటీర్ వ్యవస్థపై ఆధారపడ్డారు. కనీసం వైసీపీ క్యాడర్ ప్రజా సేవలో పాలుపంచుకునే అవకాశం ఇవ్వలేదు. అందుకే ప్రజలు వైసీపీ క్యాడర్ను విశ్వసించలేదు. వాలంటీర్ వ్యవస్థ పై నమ్మకం పెట్టుకోలేదు. ఈ అంతులేని ఓటమికి అదే కారణం.

వైయస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చేవారు.ఒకవైపు ప్రజలకు కనీస అవసరాలుగా ఉండే సంక్షేమానికి పెద్దపీట వేసేవారు. విద్య, వైద్యం వంటి అత్యవసరాల మాటున సంక్షేమ పథకాలు అమలు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నాయకులు కలిసేందుకు ఛాన్స్ ఇచ్చేవారు. ఏ చిన్న అవసరమైన తనను నేరుగా సంప్రదించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసేవారు. కానీ గత ఐదేళ్లుగా జగన్ ను కలవాలంటే తాడేపల్లి ప్యాలెస్ లో ఎన్నో ద్వారాలు దాటుకుని రావాల్సి ఉండేది. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న నేత సీఎం జగన్ ను కలవలేకపోయానని బాహటంగా చెప్పడం బాధాకరం. ఇవన్నీ వైఫల్యాలే. కానీ చంద్రబాబు ఫెయిల్ అవుతాడని, ఇచ్చిన హామీలు అమలు చేయలేడని, అందుకే వచ్చే ఎన్నికల్లో ఆయన సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతారని జగన్ చెబుతుండడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఇది ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చే పద్ధతి కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తన తండ్రి మాదిరిగా జగన్ వ్యవహరించాలని సూచిస్తున్నారు. అప్పుడే వైసీపీకి పూర్వ వైభవం వస్తుందని చెబుతున్నారు. ఇక తేల్చుకోవాల్సింది జగనే.