AP Politics: ఏపీలో వస్తే జగన్ అధికారంలోకి రావాలి.. లేకుంటే చంద్రబాబు పగ్గాలు తీసుకోవాలి. ఈ రెండే రెండు ఆప్షన్స్ ఏపీకి ఉన్నాయి. ప్రత్యామ్నాయమం అంటూ కనిపించడం లేదు. ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి అనుకున్న జనసేన, బిజెపి చంద్రబాబు నాయకత్వాన్ని జై కొడుతున్నాయి. పవర్ షేరింగ్ అన్న మాట లేకుండా కేవలం సీట్లు ప్రాతిపదికగానే పొత్తులు కుదుర్చుకుంటున్నాయి. ఫలితంగా ఈ రాష్ట్రానికి జగనా, చంద్రబాబా అన్న రెండు ఆప్షన్స్ తప్పిస్తే.. మరొకరికి ఛాన్స్ లేదని తేలిపోయింది. ఇది ముమ్మాటికీ ఆంధ్రా ప్రజలకు శాపంగా మారనుంది.
తెలంగాణలో కాంగ్రెస్, తెలుగుదేశం మధ్య హోరాహోరీ ఫైట్ ఉండేది. ఆ రెండు పార్టీలకు తప్ప మరో పార్టీకి చోటు లేదు. అప్పుడే ప్రాంతీయ భావంతో వచ్చింది టిఆర్ఎస్. దాదాపు పుష్కరకాలం పోరాడింది. అధికారంలోకి రాగలిగింది. టిడిపి, కాంగ్రెస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయమని నిరూపించుకోగలిగింది. అయితే టిడిపి కనుమరుగయ్యింది. ఆ స్థానంలోకి బిజెపి వచ్చింది. ప్రత్యామ్నాయంగా నిలబడగలిగింది. అటు కర్ణాటకలో సైతం అదే పరిస్థితి. కాంగ్రెస్, జెడిఎస్ మధ్య సుదీర్ఘకాలం ఫైట్ నడిచింది. మధ్యలో బిజెపి ఎంటర్ అయ్యింది. సుదీర్ఘకాలం పోరాడి అధికారంలోకి రాగలిగింది. కానీ ఏపీలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు.
ఏపీలో కాంగ్రెస్, టిడిపి మధ్య హోరాహోరీ ఫైట్ నడిచింది. ప్రత్యామ్నాయంగా వైసిపి, జనసేన వచ్చాయి. కానీ కాంగ్రెస్ పార్టీయే వైసిపి గా మారింది. తొలుత ప్రతిపక్షంలో నిలిచింది. తరువాత అధికారంలోకి రాగలిగింది. అయితే జనసేన మాత్రం ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగలేదు. తెలుగుదేశం వెంట నిలబడి చంద్రబాబు నాయకత్వాన్ని జై కొట్టింది. అటు బిజెపి సైతం అదే పని చేస్తోంది. దీంతో ఏపీలో పార్టీలో పక్కకు వెళ్లిపోయాయి. జగనా? చంద్రబాబా? అన్నంతగా పరిస్థితి మారింది. జగన్ సంక్షేమాన్ని చెబుతుంటే.. చంద్రబాబు అభివృద్ధి అంటూ ముందుకు వస్తున్నారు. కానీ సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తామని చెప్పే ప్రత్యామ్నాయ నాయకత్వాలు లేకపోవడం ఆంధ్రా ప్రజలకు శాపంగా మారింది.