Speed Justice: అదేదో సినిమాలో ఓ డబ్బున్న వ్యక్తి పేదింటి అమ్మాయి పై దారుణానికి పాల్పడతాడు. పోలీసులు కేసు నమోదు చేస్తారు. న్యాయస్థానం లో అతడిపై మోపిన అభియోగాలను ప్రజలతో నిరూపించడంలో పోలీసులు.. లాయర్లు విఫలమవుతుంటారు. దీంతో ఆ డబ్బున్న వ్యక్తి నిరపరాధిగా బయటపడతాడు. ఈ వ్యవహారం మొత్తాన్ని చూసిన ఓ పోలీస్ అధికారి.. రాత్రికి రాత్రి ఆ డబ్బున్న వ్యక్తి ఇంటికి వెళ్లి హత్య చేస్తాడు. దానిని ప్రమాదంగా చిత్రీకరిస్తాడు. ఈ ఘటన బాధిత కుటుంబంలో హర్షాన్ని నింపుతుంది.. న్యాయం జరిగిందని ఆ కుటుంబం భావిస్తుంది.
వాస్తవానికి చట్టాన్ని ఏ వ్యక్తి కూడా చేతిలోకి తీసుకోకూడదు. న్యాయాన్ని చెప్పాలని ప్రయత్నించకూడదు.. ఎందుకంటే ఒక వ్యక్తి చేతిలోకి చట్టం, న్యాయం వెళ్లిపోతే అది సమాజంలో పెద పోకడలకు దారితీస్తుంది. అంతిమంగా ఆటవిక రాజ్యానికి నాంది పలుకుతుంది. కానీ నేటి కాలంలో ముఖ్యంగా మన దేశంలో న్యాయ వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో దేశ ప్రధాన న్యాయమూర్తి ఒకే విషయంలో హిందువుల ఆరాధ్య దైవం విష్ణుమూర్తి పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఓ న్యాయవాది మనసును తీవ్రంగా గాయపరిచాయి. దీంతో ఆయన నిండు న్యాయస్థానంలో.. దేశ ప్రధాన న్యాయమూర్తి పై తాను ధరించిన షూ విసిరేశారు. అంతేకాదు న్యాయమూర్తి పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
వాస్తవానికి మనదే చరిత్రలో ఒక ప్రధాన న్యాయమూర్తి పై బూటు విసిరేయడం ఇదే తొలిసారి.. ఈ ఘటన పై కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తే.. మరి కొంతమంది సమర్థన వ్యక్తం చేశారు. ఇంత విసిగిపోయి ఉంటే ఒక ప్రధాన న్యాయమూర్తి పై ఓ న్యాయవాది ఆ స్థాయిలో అగ్రహం వ్యక్తం చేస్తాడంటూ చాలామంది పేర్కొన్నారు. కోర్టులో వాదించే న్యాయవాదులు నేరుగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారంటే న్యాయవ్యవస్థలో అసహనం ఏ స్థాయిలో పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
అప్పట్లో వరంగల్లో యాసిడ్ దాడి ఘటనలో పోలీసులు ఆ దారుణానికి పాల్పడిన వ్యక్తిని అంతం చేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఓ వెటర్నరీ డాక్టర్ పై దారుణానికి పాల్పడిన వ్యక్తులకు కూడా అదే స్థాయిలో శిక్ష విధించారు. ఇక ఇటీవల నిజామాబాద్ నగరంలో పోలీస్ కానిస్టేబుల్ ప్రాణాలు పోవడానికి ఓ నేరస్తుడు కారణమయ్యాడు. తుని ప్రాంతంలో బాలికపై ఓ వృద్ధుడు దారుణానికి పాల్పడ్డాడు. ఈ కేసులలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు ఊహించిన విధంగా మరణాలను ఎదుర్కొన్నారు. దీని వెనక కారణాలు ఏమైనప్పటికీ సత్వర న్యాయం అనేది ప్రజలు కోరుకుంటున్నట్టు తెలుస్తోంది.
కోర్టులలో జరిగే విచారణలో తీవ్రమైన జాప్యం చోటుచేసుకుంటున్నది. కొన్ని సందర్భాలలో నిందితుల పై అభియోగాలను నిరూపించడంలో అటు న్యాయవాదులు.. ఇటు పోలీసులు విఫలమవుతున్నారు. దీంతో ప్రజలలో అసహనం పెరిగి పోతోంది. కొన్ని సందర్భాలలో జరిగిన నేరాలు కూడా ప్రజలను తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. అందువల్లే సత్వర న్యాయం కోసం అటు ప్రజల నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది. దీంతో పోలీసులు కూడా అనివార్యంగా ప్రజలు కోరుకున్న పని చేయాల్సి వస్తోంది. రియాజ్ ఘటన కావచ్చు.. నారాయణ ఉదంతం కావచ్చు.. వారిద్దరి మరణాలకు కారణం ఎవరనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.