Lesson for Jagan: నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అనేది పెద్దల మాట. ఇప్పుడు అక్షరాలా ఏపీలో నిజమవుతోంది. లోకేష్( Minister Nara Lokesh) ఎప్పుడు మాట్లాడతాడా? ఎప్పుడు తప్పులు దొర్లుతాయా? ఎప్పుడు వ్యక్తిత్వ హననానికి పాల్పడతామా? అన్నట్టు ఉండేది అప్పటి పరిస్థితి. ఏకంగా లోకేష్ పై బాడీ షేమింగ్ ఆరోపణలు కూడా చేశారు. బహుశా ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో లోకేష్ పై జరిగిన దుష్ప్రచారం మరి ఏ ఇతర నాయకుడిపై జరిగి ఉండేది కాదు. అంతలా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. ఇందులో నేరుగా జగన్ ప్రమేయం ఉంది అని చెప్పలేం కానీ. కచ్చితంగా దానిని నియంత్రించాల్సిన బాధ్యత ఆయనపై ఉండేది. దానిని విస్మరించడంతో ఇప్పుడు జగన్ అదే వ్యక్తిత్వ హననానికి బాధితుడుగా మారుతున్నారు. ఇటీవల విదేశీ పర్యటన ముగించుకొని బెంగళూరు చేరుకున్నారు జగన్. అక్కడే దీపావళి ఘనంగా జరుపుకున్నారు. కానీ అదే ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ అవుతోంది. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం నడుస్తోంది. అయితే ఆయన పట్ల ఎవరికీ సానుభూతి మాత్రం లభించడం లేదు. దానికి కారణం గత పరిణామాలే.
వస్త్ర, షూ ధారణపై..
దీపావళి నాడు షూ వేసుకుని కనిపించారు జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ). ఆపై ఇప్పటివరకు ఆయన వస్త్రధారణకు భిన్నంగా ఉంది. సహజంగా దీపావళి అనేది హిందువుల పండుగ. కానీ టపాసులు ఏ మతం వారైనా కాల్చవచ్చు. అయితే దీపావళి నాడు మాత్రం హిందువులే ఈ పండుగను ఎక్కువగా జరుపుకుంటారు. కానీ జగన్ వస్త్రధారణ, కాలికి వేసిన బూట్లపై సోషల్ మీడియాలో విపరీతమైన వ్యతిరేక ప్రచారం నడిచింది. రీల్స్ తో పాటు మీమ్స్ ఎక్కువగా నడిచాయి. ఆడవాళ్ళ షూస్ వేసుకున్నారని ఒకరు.. చర్చి ఫాదర్ లా ఉన్నారని మరొకరు.. ఇలా లేనిపోనివి సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేశారు. కొందరైతే అదే పనిగా వ్యక్తిత్వ హననానికి దిగారు. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. కానీ అది చాలడం లేదు.
జగన్ పై వ్యతిరేక ప్రచారం..
జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇటీవల జరుగుతున్న ప్రచారం అభ్యంతరకరంగా ఉంది. ఆయన ఏదైనా ప్రెస్మీట్లో మాట్లాడే క్రమంలో చిన్నపాటి తప్పిదం దొర్లితే అదే పనిగా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఈరోజు ఇటీవల జరిగిన పరిణామాలపై జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టనున్నారు. జగన్ విదేశీ పర్యటనకు బయలుదేరే క్రమంలో నకిలీ మద్యం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అటు తర్వాత జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతుల విషయంలో సిబిఐ కోర్టుకు తప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చారన్నది ఒక ఆరోపణ. ఇంకోవైపు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు. మరోవైపు దీపావళి రోజు తనకు వ్యతిరేకంగా జరిగిన ప్రచారం. వీటన్నింటిపై ఈరోజు ప్రెస్మీట్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు. ఇలా మాట్లాడే క్రమంలో తప్పులు దొర్లితే మరో ఆట ఆడేందుకు వందలాదిమంది ఎదురుచూస్తున్నారు. అయితే ఇలా ఎదురు చూడడం కూడా జగన్మోహన్ రెడ్డి నేర్పిన విద్య. 2014 నుంచి 2024 మధ్య రాజకీయ ప్రత్యర్థులను వైసీపీ సోషల్ మీడియా వెంటాడింది. వేటాడినంత పని చేసింది.
లోకేష్ పాదయాత్ర సమయంలో..
నారా లోకేష్ పాదయాత్రకు బయలుదేరినప్పుడు వైసీపీ సోషల్ మీడియా వెయ్యి మంది యాక్టివిస్టులను నియమించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఎక్కడ లోకేష్ తప్పుడు మాటలు ఆడుతాడా.. మాటల్లో తడబడతాడా? అని ఎదురుచూసేది ఈ బృందం. ఇక మాజీ మంత్రి రోజా లాంటి వ్యక్తులు అయితే లోకేష్ కు మంగళగిరి అనడం రాదని.. మందలగిరి అంటుంటాడని బాహటంగా వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. రాజకీయాల్లో వ్యక్తిత్వ హననం అనేది జుగుప్సాకరంగా ఉంటుంది. కచ్చితంగా ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరూ బాధ్యులు కావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు దానికి బాధితులుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. గతంలో ఆయన నియంత్రించకపోవడం వల్లే ఇప్పుడు ఆయన బాధితుడిగా మారాల్సి వచ్చింది.