Telugudesam party : విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి పోటీపై ఇంతవరకు స్పష్టత రాలేదు. ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఖరారు చేశారు జగన్. ఈరోజు ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు. నామినేషన్లు వేసేందుకు రేపే తుది గడువు. కానీ ఇప్పటివరకు టిడిపి అభ్యర్థి పై క్లారిటీ రాలేదు. పీలా గోవింద సత్యనారాయణ, గండి బాబ్జీ పేర్లు వినిపించినా చంద్రబాబు ఇంతవరకు ఫైనలైజ్ చేయలేదు. రెండుసార్లు పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. వారి అభిప్రాయాలను సేకరించారు. కొందరు పోటీ పెట్టాలని.. మరికొందరు పెట్టొద్దని అధినేతను కోరినట్లు తెలుస్తోంది. అయితే స్థానిక ప్రజాప్రతినిధుల బలాన్ని అంచనా వేసుకుని.. గెలుపు సాధ్యమైతేనే అభ్యర్థిని పెడతామని చంద్రబాబు తేల్చి చెప్పినట్లు సమాచారం. అనవసరంగా బలం లేని చోట అభ్యర్థిని దించి.. ఓడిపోతే కూటమి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అని చంద్రబాబు భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. ఆ పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులను బెంగళూరు శిబిరానికి తరలించింది. రేపు తెలుగుదేశం పార్టీ నామినేషన్ దాఖలు చేయకపోతే.. బెంగళూరు నుంచి వైసీపీ స్థానిక ప్రజా ప్రతినిధులు తిరుగు ముఖం పట్టే అవకాశం ఉంది.ఒకవేళ టిడిపి అభ్యర్థి బరిలో దిగితే మాత్రం ఈనెల 30 వరకు బెంగళూరులో క్యాంపు కొనసాగనుంది.అయితే టిడిపిలో తీవ్ర తర్జన భర్జన నడుస్తుండగా.. వైసీపీ అభ్యర్థి బొత్స ధీమాతో ఉన్నారు. వీలైనంతవరకు టిడిపి పోటీకి దూరంగా ఉంటుందన్న సమాచారంతో ఆనందంలో ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
* వైసీపీకి స్పష్టమైన బలం
విశాఖ స్థానిక సంస్థల్లో వైసీపీకి స్పష్టమైన బలం ఉంది. మొత్తం ఆ పార్టీకి 800 మందికి పైగా ప్రజాప్రతినిధులు ఉన్నారు. టిడిపి కూటమికి 200 మందికి పైగా ఉన్నారు. రెండు పార్టీల మధ్య తేడా 600 వరకు ఉంది. 300 ఓట్లు చీల్చితే కానీ తెలుగుదేశం పార్టీ గెలిచే ఛాన్స్ లేదు. అయితే ఇప్పటికే చాలామంది స్థానిక ప్రజా ప్రతినిధులు కూటమి పార్టీల్లో చేరారు. విశాఖ నగరపాలక సంస్థలు అయితే దాదాపు వైసీపీ ఖాళీ అయినట్టే. భీమిలి నియోజకవర్గంలో ఇంతకుముందే ఎక్కువమంది స్థానిక ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ ఎక్కడో ఒక అనుమానం టిడిపిని వెంటాడుతోంది.
* అప్పట్లో టర్నింగ్ పాయింట్
గత ఏడాది మార్చిలో జరిగిన విశాఖ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక.. టిడిపికి టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఆ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి ఓడిపోయారు. అందుకే విశాఖ అంటేనే ఒక రకమైన సెంటిమెంట్ నడుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో బలం లేకుండా సాహసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది టిడిపికి వేధిస్తున్న ప్రశ్న. తమకు బలం లేదు కనుక పోటీ చేయలేదని తప్పుకుంటే మేలు అన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
* ఆ నిర్ణయంతోనే
అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో బొత్స అదృష్టవంతుడవుతారో? లేకుంటే టీడీపీ పోటీ పెడితే గెలుస్తారో? గెలవరో? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే టిడిపి తప్పుకుంటే మాత్రం బొత్స అదృష్టవంతుడే. ఈ ఎన్నికల్లో బొత్స కుటుంబం దారుణంగా ఓడిపోయింది. బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ లక్ష్మీ విశాఖ ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ కుటుంబానికి కనీస ప్రాతినిధ్యం లేదు. ఇప్పుడు గాని బొత్స ఎమ్మెల్సీ అయితే పెద్దల సభలో అడుగు పెడతారు. ఆయన రాజకీయ జీవితానికిఇబ్బంది ఉండదు. టిడిపి నిర్ణయం బట్టి బొత్స రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉంది. టిడిపి కూటమి అభ్యర్థిని నిలబెడితే మాత్రం బొత్స ఇబ్బందులను అధిగమించాల్సి ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More