Gudivada Amarnath: గత ఐదేళ్లుగా మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఎమ్మెల్యే గా ఉన్నా, తరువాత మంత్రి పదవి దక్కించుకున్నా.. రాజకీయ ప్రత్యర్థులపై ఓ రేంజ్ లో విరుచుకుపడేవారు. చంద్రబాబు, పవన్, లోకేష్ లను ఉతికి ఆరేసేవారు. కానీ ఇప్పుడు బొత్తిగా కనిపించడం మానేశారు. కనీసం మీడియా కూడా దొరకడం లేదు. మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రస్తుతం గాల్లో ఉన్నారు. అనకాపల్లి నుంచి జగన్ తప్పించారు. అలాగని ఎక్కడా టికెట్ కేటాయించలేదు. విశాఖ ఎంపీగానో, పెందుర్తి ఎమ్మెల్యే గానో అవకాశం ఇస్తారని భావించారు. కానీ దానిపై కూడా క్లారిటీ లేదు. దీంతో గుడివాడకు తత్వం బోధపడింది. దీంతో సైలెంట్ అయిపోయారని తెలుస్తోంది. అయితే ఆయనకు ఎక్కడో ఓ చోట సర్దుబాటు చేస్తారని ప్రచారం జరిగింది. దీంతో ఆయన యాక్టివ్ అవుతారని కూడా టాక్ నడిచింది. ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ గా ఉన్న వై వి సుబ్బారెడ్డి, జిల్లా ఎమ్మెల్యే గొల్ల బాబురావులు రాజ్యసభ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన కార్యక్రమానికి సైతం గుడివాడ అమర్నాథ్ గైర్హాజరయ్యారు.
అయితే ఈ ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ ను జగన్ తప్పిస్తారని ఎప్పటినుంచో ప్రచారం ఉంది. అయితే దానిని గుడివాడ అమర్నాథ్ లైట్ తీసుకున్నారు. తప్పకుండా తనకు సీటు లభిస్తుందని భావించారు. అనకాపల్లి నుంచి తప్పించేసరికి భావోద్వేగానికి గురై నిండు సభలోనే రోధించారు. దీంతో రీజినల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లి మరి సముదాయించారు. పార్టీలో సముచిత స్థానం ఉంటుందని హామీ ఇచ్చారు. దీంతో గుడివాడ అమర్నాథ్ కు ఏదోచోట సర్దుబాటు చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అదే వై వి సుబ్బారెడ్డి రాజ్యసభ నామినేషన్ ప్రక్రియకు సైతం అమర్నాథ్ గైర్హాజరు కావడం విశేషం. హై కమాండ్ పై అసంతృప్తితోనే ఆయన నైరాశ్యంలో ఉన్నారని.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది.
అనకాపల్లి నుంచి తప్పించిన గుడివాడ అమర్నాథ్ కు మూడు నియోజకవర్గాలు ఆప్షన్ గా ఉన్నాయి. చోడవరం, ఎలమంచిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో ఏదో ఒకచోట పోటీ చేయాలని అమర్నాథ్ భావించారు. దీంతో హై కమాండ్ చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని పిలిపించి మాట్లాడినట్లు తెలుస్తోంది. మీకు ఎంపీగా సర్దుబాటు చేస్తాం.. చోడవరం విడిచి పెట్టాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ అందుకు ధర్మశ్రీ ఒప్పుకోలేదని తెలుస్తోంది. అటు ఎలమంచిలి లో సైతం కన్నబాబురాజు సీనియర్ గా ఉన్నారు. పెందుర్తిలో సైతం సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజుకు వైవి సుబ్బారెడ్డి అండగా నిలుస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గుడివాడ అమర్నాథ్ కు ఛాన్స్ లేదని ప్రచారం జరుగుతోంది.దీంతో బయటకు వచ్చేందుకు గుడివాడ అమర్నాథ్ ఇష్టపడడం లేదు. అందుకే రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియకు హాజరు కాలేదని తెలుస్తోంది. మొత్తానికైతే రాజకీయంగా దూకుడుగా ఉండే గుడివాడ అమర్నాథ్ కు జగన్ ఝలక్ ఇచ్చారు.