https://oktelugu.com/

YSR Congress  : వైఎస్సార్ కాంగ్రెస్ లో ఆ ధైర్యం బాగుంది!

ఏ పార్టీ అయినా ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. పోరాట బాట పట్టాలి. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అదే తరహా మార్పు కనిపిస్తోంది.

Written By: , Updated On : February 18, 2025 / 12:56 PM IST
YSR Congress party 

YSR Congress party 

Follow us on

YSR Congress  : వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొన్ని ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు ధైర్యంగానే పోరాటం చేస్తున్నాయి. నిన్న మున్సిపల్ ఉప ఎన్నికల్లో అదే స్పష్టం అయింది. సాధారణంగా ఇటువంటి ఎన్నికల్లో అధికార పార్టీ ముద్ర ఉంటుంది. వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఆ సమయంలో అధికార పార్టీకి ఎదురుగా వెళ్లడం కష్టతరమైన పని. దాడులను ఎదుర్కోవడం, కేసులను ఫేస్ చేయడం అంత ఈజీ కాదు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ విషయంలో కొన్ని ప్రాంతాల్లో సక్సెస్ అయ్యాయి. తిరుపతిలో చివరివరకు భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన తనయుడు అభినయ రెడ్డి గట్టిగానే పోరాడారు. నిన్న తునిలో సైతం అదే స్పష్టమైంది. దాడిశెట్టి రాజా తో పాటు ముద్రగడ పద్మనాభం, కురసాల కన్నబాబు ఇదే మాదిరిగా చివరి వరకు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పిడుగురాళ్లలో సైతం వైసీపీ నేతలు అడ్డగించారు. అయితే కూటమి గెలవవచ్చు గాక.. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవడం మాత్రం విశేషం అని చెప్పాలి.

* అప్పట్లో చేతులెత్తేసిన టిడిపి
2021లో స్థానిక సంస్థల ఎన్నికలు( local body elections) జరిగాయి. మునిసిపల్ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా నడిచింది. తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోయింది. అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడు ముందు నిలవలేకపోయింది తెలుగుదేశం. కనీసం ఆ పార్టీ శ్రేణులు నిలువరించే ప్రయత్నం చేయలేదు. ఫలితంగా రాష్ట్రంలో ఒక్క తాడిపత్రి మినహా అన్నింటిని క్లీన్ స్వీప్ చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అప్పటికే సార్వత్రిక ఎన్నికలు జరిగి రెండేళ్లు పూర్తయింది. అయినా సరే అప్పటి అధికార పార్టీకి ఎదురు వెళ్ళడానికి తెలుగుదేశం నేతలు భయపడ్డారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఓడిపోయిన ఎనిమిది నెలలకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూటమి అధికారానికి ఎదురు వెళ్లడం చిన్న విషయం కాదు.

* ధైర్యంతో పోరాటం
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో ఒక విచిత్రమైన పరిస్థితి నడుస్తోంది. ఆ పార్టీకి కీలక నేతలు ఉన్నచోట.. పార్టీ శ్రేణులు ధైర్యంతో ఉన్నాయి. భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్నాయి. కానీ వ్యాపారాలు, కేసులు ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ నేతలు తమకు ఎందుకు అన్న ధోరణితో ఉన్నారు. అటువంటి చోట్ల మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బయటకు వచ్చేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు. నాయకుడు ముందుగానే సరెండర్ కావడంతో వెనుక నడిచేందుకు పార్టీ శ్రేణులు కూడా ఉండడం లేదు. అటువంటి చోట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రమాదంలో ఉందనే చెప్పాలి. అయితే ఏ కేసులు లేని వారు, ఒకవేళ ఉన్నా భయపడని వారు, వ్యాపారాలతో సంబంధం లేని నేతలు మాత్రం స్వేచ్ఛగా తమ వాయిస్ వినిపిస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. నిలదీసినంత పని చేస్తున్నారు. నాయకుడిని చూసి క్యాడర్ కూడా ధైర్యంగా బయటకు వస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తోంది.

* కలిసి వస్తున్న కాలం
అయితే స్వల్ప కాలంలో ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అటు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు( welfare schemes) అమలు చేయకపోవడం సైతం వైయస్సార్ కాంగ్రెస్ కు కలిసి వస్తోంది. ఒకవేళ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రజా పోరాటాలు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ గా ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో అయితే అసలు పార్టీ ఉందా? లేదా? అన్న సందేహాలు మాత్రం వ్యక్తం అవుతున్నాయి. వీటన్నింటినీ సరిచేసి ముందుకెళ్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ దక్కవచ్చు.