AP Pensions: పింఛన్ల విషయంలో ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అనర్హులు పెద్ద ఎత్తున పింఛన్లు దక్కించుకున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. బోగస్ పింఛన్లు అధికమని ప్రభుత్వం వద్ద సమాచారం కూడా ఉంది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అనర్హుల విషయంలో సీరియస్ గా స్పందించింది. గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా కొన్ని సచివాలయాల్లో ప్రయోగాత్మకంగా పింఛన్ల తనిఖీ చేపట్టింది. అయితే తప్పుడు ధృవీకరణ పత్రాలతో దివ్యాంగుల పింఛన్లు పక్కదారి పట్టాయని తేలింది. దీంతో దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమీక్షలో కీలక ఆదేశాలు ఇచ్చారు. దివ్యాంగ పెన్షన్లను తనిఖీ చేయాలని నిర్ణయించారు. ఈనెల 6 నుంచి పింఛన్ల తనిఖీ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో అనర్హుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
* తనిఖీకి ప్రత్యేక బృందాలు
రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షలకు పైగా దివ్యాంగుల పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. అందులో మంచానికే పరిమితమైన వారికి నెలకు పదిహేను వేల రూపాయల చొప్పున పింఛన్ వస్తోంది. ఇటువంటి వారు రాష్ట్రవ్యాప్తంగా 24, 091 మంది ఉన్నారు. వీరందరి వివరాలను, సదరం ధ్రువీకరణ పత్రాలను తనిఖీ చేయనున్నారు అధికారులు. ఇప్పటికే పింఛన్ల తనిఖీలకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. మంచానికే పరిమితమైన వారి ఇళ్ల దగ్గరికి వైద్య బృందాలు వెళ్లి తనిఖీలు చేయాలని ఆదేశించింది. ఇక దివ్యాంగుల కేటగిరిలో పింఛన్ తీసుకున్న వారిని సమీపంలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు చేస్తారు. పింఛన్ లబ్ధిదారులు ఏరోజు రావాలో ముందుగానే వారికి తెలియజేస్తారు. అంతే కాదు రోజుకు కనీసం 25 మంది చొప్పున ఒక్కో వైద్య బృందం తనిఖీ చేయనుంది.
* తరువాత నెలలో హోల్డ్
ఈ వైద్య పరీక్షలకు పింఛన్ లబ్ధిదారులు హాజరు కాకపోతే.. తరువాత నెలలో పింఛన్లను హోల్డ్ లో పెడుతుంది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు పూర్తయిన తర్వాత కూడా.. మళ్లీ లబ్ధిదారుల వివరాలను మరోసారి పరిశీలించనున్నారు. దీనికోసం ఆయా జిల్లాల కలెక్టర్లు మరో వైద్య బృందాన్ని ఏర్పాటు చేస్తారు. అప్పటికీ అనర్హులకు పింఛన్లు అందుతున్నాయని తేలితే ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసిన వైద్యులపై చర్యలు తీసుకుంటారు. మొత్తానికి అయితే బోగస్ పింఛన్ల పై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఈ బోగస్ పింఛన్ల ఏరివేత తరువాతే.. కొత్త పింఛన్లు మంజూరయ్యే అవకాశం ఉంది.