Sea plane flights : ఏపీలో సీ ప్లేన్ అందుబాటులోకి రానుంది. ఇందుకు విజయవాడ వేదిక కానుంది. దేశంలోనే మొదటి సీ ప్లేన్ ఇదే కావడం విశేషం. విజయవాడ టు శ్రీశైలం వరకు ఏర్పాటైన ఈ సీ ప్లేన్ ట్రైల్ రన్ విజయవంతంగా పూర్తయింది. ఇంతకీ ఈ సీ ప్లేన్ అంటే ఏంటి? దీనివల్ల ఎవరికి ప్రయోజనం? ఇంతకుముందు ఎక్కడ నిర్వహించారు? అన్నదిఆసక్తికరంగా మారింది. సి ప్లేన్లు అంటే నీటిలో నడిచే విమానాలు. ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ఇవి అందుబాటులో ఉన్నాయి. పర్యాటక ప్రాంతాల్లో దర్శనం ఇస్తుంటాయి. వీటి తయారీలో కెనడాకు చెందిన హావిల్యాండ్ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ ప్రసిద్ధి చెందినది. ఈ సంస్థ తయారుచేసిన డిహెచ్సి 6 వీన్ అట్టర్ క్లాసిక్ 300 మోడల్ సి ప్లేన్ ను విజయవాడ నుంచి శ్రీశైలం వరకు నడపనున్నారు. ఇది 200 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 45 నిమిషాల్లో చేరుకోగలదు. పదేళ్ల కిందట దీనిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ ఈసారి ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామ్యం అయింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు తీసుకున్నారు. ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ సీ ప్లేన్ సర్వీసులు ప్రారంభం అయ్యాయి.
* ట్రయల్ రన్ సక్సెస్
ఇప్పటికే సి ప్లేన్ లకు సంబంధించి ట్రయల్ రన్ పూర్తయింది. దీంతో ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సి ప్లేన్ లో ప్రయాణం చేయనున్నారు. శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు ప్రకాశం బ్యారేజ్ పున్నమి ఘాట్ వద్ద మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరనున్నారు. 12:45 గంటలకు శ్రీశైలం చేరుకుంటారు. అక్కడ శ్రీశైలం మల్లన్న దర్శించుకుని మళ్ళీ తిరిగి విజయవాడ చేరుకుంటారు.మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు వద్ద… పాతాళ గంగ వద్ద సీ ప్లేన్ ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో శ్రీశైలం అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు జల్లెడ పడుతున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్లో ఎన్డిఆర్ఎఫ్ బృందాలు, పోలీస్ బలగాలు, రెస్క్యూ టీంలు రెడీగా ఉన్నాయి.
* 14 సీట్లతో అందుబాటులోకి
14 సీట్లతో ఈ సీ ప్లేన్ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా శ్రీశైలం జలాశయంలో భక్తులకు ఆహ్వానం, ఆనందం అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ పర్యాటక అభివృద్ధికి ఈ సీప్లేన్ విమాన సర్వీసులు ఉపయోగపడనున్నాయి. అదే సమయంలో ఆలయాలకు భక్తుల రద్దీ పెరగనుంది. అందుకే సామాన్యులకు సైతం అందుబాటు ధరల్లో సీప్లేన్ విమాన సర్వీసుల టిక్కెట్లు తెస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.