Amaravati Capital: అమరావతికి గుడ్ న్యూస్. కేంద్రం బడ్జెట్లో ప్రకటించిన 15000 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలోనే విడుదల చేసేందుకు ప్రపంచ బ్యాంకు అంగీకరించింది.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి కూడా స్పష్టం చేసింది. అడ్వాన్స్గా 3750 కోట్లు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా కూడా అంగీకరించింది. ఈ నిధులు నవంబర్ నాటికి సర్దుబాటు చేయాలని భావిస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పై ఫోకస్ పెట్టింది.అదే సమయంలో కేంద్రం కూడా ప్రాధాన్యమిస్తామని చెప్పుకొచ్చింది. అందుకు తగ్గట్టుగానే బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయల కేటాయింపులు చేసింది.అయితే అది రుణమా? గ్రాంటా? అన్న చర్చ సాగింది. కానీ ప్రపంచ బ్యాంక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సంయుక్తంగా ఈ నిధులు సర్దుబాటు చేస్తాయని కేంద్రం స్పష్టత ఇచ్చింది. 90 శాతాన్ని కేంద్రమే భరించనుంది. రాష్ట్రం భరించాల్సిన 10% నిధులను కూడా వేరే రూపంలో కేంద్రం సర్దుబాటు చేస్తుందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రపంచ బ్యాంకు నిధులు కేటాయించిన నేపథ్యంలో.. అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం పలుమార్లు అమరావతిని సందర్శించింది. వారి అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వం నివృత్తి చేయగలిగింది. దీనిపై సంతృప్తి వ్యక్తం చేసిన ప్రపంచ బ్యాంకు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్రానికి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే అంటే.. 2025 ఏప్రిల్ లోపు ఈ నిధుల విడుదలకు అంగీకరించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా అడ్వాన్స్గా 3750 కోట్లు చెల్లించాలని నిర్ణయించడం విశేషం.
* శరవేగంగా జంగిల్ క్లియరెన్స్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. అయితే మధ్యలో భారీ వర్షాలు నేపథ్యంలో ఈ పనులకు ఆటంకం కలిగింది. అయినా సరే డిసెంబర్ నాటికి అమరావతిని యధాస్థితికి తీసుకొచ్చి.. పనులు ప్రారంభించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. అమరావతి నిర్మాణ బాధ్యతలను మంత్రి నారాయణకు అప్పగించారు చంద్రబాబు. అదే సమయంలో నిధుల సమీకరణకు చంద్రబాబు సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు సైతం కొలిక్కి వస్తున్నాయి. కేంద్రం ప్రపంచ బ్యాంకు నిధుల ద్వారా అందించాల్సిన సాయం.. సకాలంలో అందితే దాదాపు నిర్మాణాలన్నీ ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పనులు సైతం శరవేగంగా జరిగే అవకాశాలు ఉన్నాయి.
* రూ.49 వేల కోట్ల అంచనా
అమరావతి రాజధాని లో మౌలిక వసతుల అభివృద్ధి, భూ సమీకరణలో భూమిలిచ్చిన రైతులకు స్థలాలు కేటాయింపు, లే అవుట్ల అభివృద్ధి, పరిపాలన నగరంలో శాసనసభ, హై కోర్ట్, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల టవర్ల నిర్మాణం వంటి పనులకు 49 వేల కోట్లు ఖర్చు అవుతుందని సిఆర్డిఏ అంచనా వేసింది. అయితే తొలి ఆర్థిక సంవత్సరంలోనే కేంద్రం 15 వేల కోట్ల రూపాయలు సర్దుబాటు చేయడంతో అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా జరిగే అవకాశం ఉంది.
* ఎటువంటి జాప్యం లేకుండా
సాధారణంగా ప్రపంచ బ్యాంకు రుణాలు అంటే చాలా జాప్యం జరుగుతాయని ఒక అపవాదు ఉంది. అటువంటిది ఒకే ఆర్థిక సంవత్సరంలో 15 వేల కోట్ల రూపాయలు సర్దుబాటు చేసేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకు రావడం విశేషం. వాస్తవానికి ప్రపంచ బ్యాంకు లాంటి సమస్యలు నిర్దిష్ట ప్రాజెక్టులకు మాత్రమే రుణాలు ఇస్తాయి. చాలా సంప్రదింపులు జరిగాక మాత్రమే స్పందిస్తాయి. అలాంటిది అమరావతికి రుణం మంజూరుకు శరవేగంగా పచ్చ జెండా ఊపడం మాత్రం శుభపరిణామం. ఆర్థిక నిపుణులు సైతం ఇదే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ 15 వేల కోట్లతో అమరావతి నిర్మాణాలను ఒక కొలిక్కితెస్తే.. మిగతా నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో సైతం కేంద్రం నిధులు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ అమరావతికి శుభశకునాలే.!