PM Narendra Modi : వరదల్లో తీవ్రంగా నష్టపోయిన తెలుగు రాష్ట్రాలను ఆదుకునేందుకు పెద్దన్న మోడీ కి పెద్ద మనసు రాలేదు. కేంద్ర మంత్రి, అధికారుల బృందం పర్యటించినా, తెలుగు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు వంగివంగి దండాలు పెట్టినా పెద్దన్నలా ఆదుకుంటాడని ఆశించిన మోడీ అబ్బే అలాంటి ఆశలేమీ పెట్టుకోవద్దని తేల్చేశారు. ఎన్డీయే పక్షమే అయినా ఏపీకీ నష్టంలో 15 పైసల సాయమే ఇచ్చి చేయి దులుపుకున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రభుత్వం కావడంతో తెలంగాణకి మరీ దారుణంగా బిచ్చమేసినట్లు 4 పైసల సాయం ఇచ్చి వదిలించుకున్నారు.
■ వరదలకు తీవ్రంగా నష్టపోయిన తెలుగు రాష్ట్రాలు:
ఇటీవల వరదలకు తెలుగు రాష్ట్రాలు విలవిలలాడాయి. ఏపీ ప్రధాన నగరం విజయవాడ నీట మునిగి జనం అల్లాడారు. బుడమేరు, మున్నేరు, పాలేరు పొంగిప్రవహించడంతో పంటల కొట్టుకుపోతే, ఇళ్ళు మునిగి జనం చనిపోయారు. విద్యుత్ లైన్లు ,రోడ్లు తెగిపోయాయి. 40 మంది వరకు చనిపోయారు కూడా. తెలంగాణలో ఖమ్మం, వరంగల్, సూర్యాపేట జిల్లాల్లో వరదలు ప్రళయమే సృష్టించాయి. కాల్వ లు తెగి, పాలేరు, మున్నేరు పొంగి పంటలు కొట్టుకుపోయాయి. కాలనీలు, లోతట్టు గ్రామాలు నీటమునగడంతో వేలాదిగా నిర్వాసితులయారు.
■ కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకి దక్కింది అరకొరనే: కేంద్రంలోనూ బీజేపీ నేతృత్వ ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వాములవడం, రాష్ట్రంలోనూ ఎన్డీయే పేరు మీదనే ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పటికీ వరద సాయంలో ఏపీని మోడీ పట్టించుకోలేదు. ఇటీవలి వరదలకు రాష్ట్రంలో రూ.6880 కోట్ల వరద నష్టం జరిగినట్లు కేంద్రానికి నివేధిస్తే మంగళవారం విడుదల చేసిన వరద సాయం కేవలం రూ.1063 కోట్లే.. నష్టంలో 15 పైసల సాయమే కేంద్రం ఇవ్వడంపై విమర్శలు వస్తున్నా, సీయం చంద్రబాబు మాత్రం ఏమీ అనలేని దుస్థితి ఎదుర్కొంటున్నారు.
■ తెలంగాణకి వరద సాయంలో పూర్తి వివక్ష: ఎన్డీయే ప్రభుత్వమే ఉన్న ఏపీకి అరకొర సాయమే ఇచ్చిన ప్రధాని మోడీ , కాంగ్రెస్ పాలిత తెలంగాణ రాష్ట్రంపై పూర్తి వివక్ష ప్రదర్శించారు. మోడీ తనకు పెద్దన్న అని ,ఎన్నికల తర్వాత రాజకీయాలుండవని, కేంద్రంతో సఖ్యంగానే వుంటామంటూ సీయం రేవంత్ రెడ్డి ఎన్ని మెట్లు దిగినా పెద్దన్న మోడీకి తెలంగాణపై కనికరం కలగలేదు. అసలు ఇవ్వకపోతే బాగుండదని కేంద్ర మంత్రి చెప్పినట్లుంది.. అందుకే నష్టంలో నలుగు పైసల సాయం ప్రకటించి ద్వారాలు మూసేసారు. రాష్ట్రంలో ఈ వరదలకు రూ.10,030 కోట్ల మేర నష్టం వాటిల్లితే కేంద్రం రూ. 416.80 కోట్ల సాయమే ప్రకటించింది. బీజేపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు, మరో ఆరుగురు ఎంపీలు తెలంగాణ నేతలున్నప్పటికీ వాళ్ళకి మోడీ వద్ద ఎలాంటి పలుకుబడి లేదనే విషయం ధీంతో తేలిపోయింది.