Visakhapatnam: విశాఖలో గెలుపెవరిదంటే.. గ్రౌండ్ రిపోర్ట్

వైసిపి అనూహ్యంగా మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సీ లక్ష్మి బరిలో దించింది. కూటమి అభ్యర్థిగా టిడిపి నుంచి భరత్ పోటీ చేస్తున్నారు. వాస్తవానికి పొత్తులో భాగంగా ఈ సీటును బిజెపి కోరుకుంది.

Written By: Dharma, Updated On : May 10, 2024 1:04 pm

Visakhapatnam

Follow us on

Visakhapatnam: దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న పార్లమెంట్ స్థానాల్లో విశాఖ ఒకటి. పర్యాటకంగా గుర్తింపు పొందింది విశాఖ నగరం. విశాఖ స్టీల్ ప్లాంట్ తో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు విశాఖలో ఎక్కువగా ఉన్నాయి. సుదీర్ఘ తీర ప్రాంతం ఈ నగరం సొంతం. అందుకే జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది విశాఖ నగరం. అందుకే ఇక్కడ పాగా వేసేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. గెలుపు సైతం ప్రతిష్టాత్మకంగా మారుతోంది.

వైసిపి అనూహ్యంగా మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సీ లక్ష్మి బరిలో దించింది. కూటమి అభ్యర్థిగా టిడిపి నుంచి భరత్ పోటీ చేస్తున్నారు. వాస్తవానికి పొత్తులో భాగంగా ఈ సీటును బిజెపి కోరుకుంది. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నరసింహం అయితే కొన్నేళ్లుగా సాగరనగరంలో కార్యకలాపాలు ప్రారంభించారు. ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు అధికంగా ఉండడం, పొత్తులో భాగంగా ఈ సీటును బిజెపికి టిడిపి విడిచి పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయితే గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన భరత్ తక్కువ మెజారిటీతో ఓడిపోయారు. గత ఐదు సంవత్సరాలుగా పార్లమెంట్ స్థానం పరిధిలో టిడిపి బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు. పైగా నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు. అందుకే ఈ సీట్ ను వదులుకునేందుకు టిడిపి ఇష్టపడలేదు. పైగా పొత్తును వ్యతిరేకించిన జీవీఎల్ కు అవకాశం లేకుండా చేయాలని భావించారు. అందుకే విశాఖ బదులు అనకాపల్లి పార్లమెంట్ స్థానాన్ని బిజెపికి కేటాయించి.. సీఎం రమేష్ అభ్యర్థిత్వాన్ని ఆమోదించారు.

విశాఖ పార్లమెంట్ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. విశాఖ నగరంలోని నాలుగు నియోజకవర్గాలు, గాజువాక, భీమిలితోపాటు విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం విశాఖ లోక్ సభ పరిధిలో ఉన్నాయి. ఇక్కడ తన భార్యను గెలిపించేందుకు మంత్రి బొత్స సత్యనారాయణ సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. అయితే విశాఖ నగరానికి సంబంధించి దక్షిణ నియోజకవర్గంలో వైసిపి బలంగా కనిపిస్తోంది. ఉత్తరంలో సైతం ఆ పార్టీకి ఎడ్జ్ ఉంది. తూర్పులో మాత్రం టిడిపి బలంగా ఉంది. గాజువాకలో టిడిపికి అనుకూలంగా ఉంది. భీమిలిలో భారీ మెజారిటీ దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. శృంగవరపుకోట నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్సీ భార్యతో పాటు మెజారిటీ క్యాడర్ టిడిపి వైపు మొగ్గు చూపింది. దీంతో అక్కడ వైసిపి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. అయితే గతంలో తక్కువ ఓట్ల మెజారిటీతో ఓడిపోవడం భరత్ వైపు సానుభూతి కనిపిస్తోంది.

బొత్స ఝాన్సీ లక్ష్మి బలమైన సామాజిక వర్గానికి చెందినవారు కావడం.. మంత్రి బొత్స కు ఎలక్షన్ క్యాంపెయిన్ తెలియడం వంటి కారణాలతో ఈ సీటు హాట్ గా మారింది. ఇరు పార్టీలు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గత ఎన్నికల్లో ఎనిమిది వేల ఓట్లతోనే వైసిపి ఈ స్థానాన్ని గెలుచుకుంది. అప్పట్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన జెడి లక్ష్మీనారాయణ రెండున్నర లక్షల ఓట్లు సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు జనసేనతో పొత్తు, మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు బిజెపి కూటమి వైపు మొగ్గుచూపుతుండడంతో.. సునాయాస విజయం దక్కించుకోవచ్చని టిడిపి భావిస్తోంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, విశాఖ రాజధాని వంటి అంశాలతో తమకు మొగ్గు ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరి ప్రజల అభిప్రాయం ఎలా ఉందో చూడాలి. జూన్ 4న ఫలితం వెల్లడయ్యే వరకు వేచి చూడక తప్పదు.