AP Volunteers : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 75 రోజులు దాటుతోంది. ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి టిడిపి కూటమి ప్రజలకు చాలా రకాల హామీలు ఇచ్చింది. ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించింది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు 5 ముఖ్యమైన ఫైళ్లపై సంతకం చేశారు. ఎన్నికల హామీలను అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల ప్రారంభం వంటివి చేపట్టారు. ప్రాధాన్యత క్రమంలో మిగతా హామీలను అమలు చేస్తామని సీఎం చంద్రబాబు తో పాటు మంత్రులు చెబుతున్నారు.అయితే తమను కొనసాగిస్తారని చాలామంది వాలంటీర్లు ఆశించారు. కానీ మూడు నెలలు దాటుతున్న వారి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఉండేవారు. అయితే వారు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తారని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో సంక్షేమ పథకాల అమలు బాధ్యత నుంచి వాలంటీర్లను తప్పించింది ఎన్నికల సంఘం. అయితే వైసిపి నేతల ఒత్తిడి మేరకు సగానికి పైగా వాలంటీర్లు పదవులకు రాజీనామా చేశారు. కానీ ఒక లక్ష మంది వాలంటీర్ల వరకు ఎటువంటి రాజీనామా చేయలేదు. ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు రాజీనామా చేయవద్దని కూడా చంద్రబాబు పిలుపునిచ్చారు. అందర్నీ కొనసాగిస్తామని.. పదివేల రూపాయలు గౌరవ వేతనం అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ గురించి ఇప్పుడు పట్టించుకోవడం లేదు. దీంతో వాలంటీర్లు పునరాలోచనలో పడ్డారు.
*:పింఛన్ల పంపిణీ సక్సెస్ ఫుల్ గా
ఇప్పటికే పింఛన్ల పంపిణీ బాధ్యతను సచివాలయ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ శాఖల సిబ్బందికి అప్పగించారు. గత రెండు నెలలుగా పింఛన్ల పంపిణీ విజయవంతంగా పూర్తి చేశారు. మరోవైపు వాలంటీర్ల వేతనాలు సైతం ఇవ్వడం లేదు. దీంతో వారి కొనసాగింపు పై నీలి నీడలు కమ్ముకున్నాయి. గత నెల నుంచి వారికి చెల్లించాల్సిన జీతాలు కూడా చెల్లింపులు చేయడం లేదు. కనీసం వారి ప్రస్తావన కూడా లేదు. దీంతో కొనసాగింపు పై అనుమానాలు నెలకొన్నాయి. అసలు కూటమి ప్రభుత్వానికి వలంటీర్లను కొనసాగించే ఉద్దేశం ఉందా? లేదా అన్నది ఇప్పుడు అనుమానం కలుగుతోంది.
* వాలంటీర్ వ్యవస్థ లేనట్టేనా?
అయితే క్షేత్రస్థాయిలో మాత్రం వాలంటీర్లు వద్దన్నది టిడిపి నేతల నుంచి వినిపిస్తున్న మాట. దుబారా ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా వాలంటీర్ వ్యవస్థను తొలగించడమే మేలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే తమను కొనసాగిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు కనుక.. ఎట్టి పరిస్థితుల్లో తమను వాలంటీర్లుగా తీసుకోవాలని వారి నుంచి డిమాండ్ వినిపిస్తోంది. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రావడం లేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపనే తప్ప.. ఎవరూ పెద్దగా స్పందించడం లేదు.
* తాడోపేడోకు సిద్ధం
అయితే ఇప్పటివరకు ఓపిక పట్టిన వాలంటీర్లు ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తున్నారు. తమకు వేతనం పెంచి ఇస్తామన్న హామీను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఈనెల 27న ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వాలంటీర్ల విషయంలో ఒక నిర్ణయానికి రావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యమ కార్యాచరణ పై ఈనెల 31న రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఉద్యమానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. మొత్తానికి అయితే ఉద్యమం వైపు వాలంటీర్లు అడుగులు వేస్తుండడం విశేషం.