Mirchi farmers : మిర్చి రైతులకు ( Mirchi farmers)గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. మిర్చి రైతులకు భారీ శుభవార్త ప్రకటించింది. మిర్చి పంట పై కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ నుంచి మిర్చి ఎగుమతులను పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. మార్కెట్ ఇంటర్ వెన్షన్ స్కీం కింద ఏపీలోని మిర్చి రైతులను ఆదుకునేందుకు కేంద్రం సిద్దమయింది. ఈ స్కీం కింద వీలైనంత ఎక్కువ సాయం చేసే ప్రతిపాదనను కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. తక్షణ చర్యలు, పరిష్కార మార్గం కనుక్కోవాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు గురువారం కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఆదేశించారు. ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖల తోనూ సమన్వయం చేసుకొని పరిష్కారం కనుగొనాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం చంద్రబాబు విజ్ఞప్తి, శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశాలతో కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు రంగంలోకి దిగారు.
* మార్కెట్ యార్డ్ ను సందర్శించిన జగన్
ఇటీవల మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) గుంటూరు మిర్చి యార్డును పరిశీలించిన సంగతి తెలిసిందే. అక్కడ రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా మిర్చికి గిట్టుబాటు కలగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా సుదీర్ఘంగా ఒక ట్వీట్ చేశారు. అందులో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై కూడా ప్రస్తావన తీసుకొచ్చారు. తక్షణం మిర్చి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అయితే అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించిన నేపథ్యంలో.. ఎన్డీఏ భాగస్వామి పక్షంగా సీఎం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరయ్యారు.
* కేంద్ర మంత్రిని కలిసిన చంద్రబాబు
అయితే ముందస్తు షెడ్యూల్ లో భాగంగానో.. లేకుంటే జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చిన విమర్శలను గుర్తించో.. తెలియదు కానీ సీఎం చంద్రబాబు( CM Chandrababu) నేరుగా మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ను కలిశారు. మిర్చి రైతుల సమస్యలను విన్నవించారు. అయితే దీనిపై జగన్మోహన్ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రస్తావించే వరకు మిర్చి రైతుల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చంద్రబాబు చేయలేదని.. కానీ అప్పటికప్పుడు కేంద్రమంత్రిని కలిసి క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. అయితే ఇంతలో కేంద్ర ప్రభుత్వం నుంచి మిర్చి రైతులకు గుడ్ న్యూస్ వచ్చింది. దీంతో మిర్చి ధర పెరిగే అవకాశం ఉంది.
* ఆ తేడాను భరించేందుకు ముందుకు వచ్చిన కేంద్రం
మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీములో( market intervention scheme) 25 శాతం ఉన్న సీలింగ్ ను ఎత్తివేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. 75% మేర పంట కొనుగోలుకు కేంద్రం అంగీకారం తెలిపినట్లు సమాచారం. మిర్చి ఉత్పత్తి వ్యయం మార్కెట్ ధరకు మధ్య తేడాను సరిదిద్దేందుకు కేంద్రం అంగీకరించింది. మార్కెట్ ధర- ఉత్పత్తి వ్యయం మధ్య తేడా భరించేందుకు కేంద్రం సిద్ధమయింది. మిర్చి రైతుల అంశాన్ని కేంద్రమంత్రి దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లడంతో.. దీనికి పరిష్కార మార్గం దొరికిందని కూటమి పార్టీల నేతలు భావిస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించిన తరువాతే మిర్చి రైతుల సమస్యలకు పరిష్కార మార్గం దొరికిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. దీంతో రెండు పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ కూడా ప్రారంభం అయింది.