Registration Prices
Registration Prices : పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. వాహనాల కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ఇప్పటికే అనేక రకాల చర్యలను కేంద్రం తీసుకుంటుంది. ఏ రాష్ట్రానికి ఢిల్లీ లాంటి పరిస్థితి రావొద్దని.. పలు పథకాలను అమలు చేస్తుంది. అలాగే పర్యావరణానికి అనుకూలమైన ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తుంది. కాకపోతే ఇప్పటికే వాహనాలు కలిగి ఉన్న వాళ్లకు మాత్రం భారీ షాక్ ఇచ్చింది. 20 సంవత్సరాల వయస్సు దాటిన వాహనాల రెన్యువల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను భారీగా పెంచే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ మార్పు ద్వారా పాత వాహనాల ఉపయోగంపై నియంత్రణ పెంచి.. పర్యావరణం కోసం అనుకూల మార్గాలను రూపొందించాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకోనుంది.
20 సంవత్సరాల వయస్సును దాటిన వాహనాల కోసం కొత్త రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఛార్జీలు విధించాలని కేంద్రం భావిస్తోంది. వాటి కోసం వసూలు చేయనున్న ఛార్జీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 20 ఏళ్లు పైబడిన టూ వీలర్ కోసం రూ.2వేలు, త్రీ వీలర్ కోసం రూ.5వేలు, కార్లు రూ.10వేలు, మీడియం ప్యాసింజర్/గూడ్స్ వాహనాలకు రూ.25వేలు, హెవీ వెహికల్స్‌కు రూ.36వేలు వసూలు చేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి. అలాగే 15 ఏళ్లు పైబడిన మీడియం ప్యాసింజర్ వాహనాలకు రూ.12వేలు, హెవీ వాటికి రూ.18వేలు వసూలుకు ప్రతిపాదించింది.
ఈ ఛార్జీల పెంపు వాహనాలను కాలుష్యాన్ని ఎక్కువగా విడుదల చేసే వాహనాలుగా గుర్తించడం, కాలుష్యానికి కారణమయ్యే పాత వాహనాలను తగ్గించడంలో సహాయపడుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న వాహనాలను పర్యావరణానికి హానికలిగించని వాటితో ఎక్సేంజ్ చేయాలని భావిస్తుంది. అందుకే 15 సంవత్సరాలు దాటి ఉన్న వాహనాల కోసం కూడా రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఛార్జీల పెంపు ప్రతిపాదన ఉంది. ఈ ప్రతిపాదనను అమలు చేస్తే పాత వాహనాల వాడకం తగ్గిపోతుంది. వాటిని మార్చి నూతన వాహనాలు కొనుగోలు చేయాలనుకునే యాజమాన్యాలకు ప్రోత్సాహం లభిస్తుంది.
ఈ ప్రతిపాదనపై వివిధ వాహన యాజమాన్యాలతో చర్చలు జరగనున్నాయి. అయితే, ఈ మార్పు అమలు తేదీపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు. పాత వాహనాలు కాలుష్యాన్ని ఎక్కువగా కలిగించే కారణంగా ఈ చర్య పర్యావరణం పై తక్కువ ప్రభావం చూపించడానికి అనుకూలంగా ఉంటుందని కొందరు చెబుతున్నారు.