Supreme Court: దేశ అత్యున్నత న్యాయస్థానంలో తెలుగు మాటలు వినిపించాయి. సాధారణంగా సుప్రీంకోర్టులో( Supreme Court) ఇంగ్లీష్, హిందీలో వాద ప్రతి వాదనలు జరుగుతాయి. కానీ ఒక్కసారిగా తెలుగు సంభాషణ వినిపించడం విశేషం. అది కూడా న్యాయమూర్తి తెలుగులో మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాకినాడకు చెందిన ఓ జంట విడాకుల కేసుకు సంబంధించి విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి తెలుగులో మాట్లాడుతూ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇదొక ప్రాధాన్యత అంశంగా మారింది.
* వరకట్నం కేసు..
కాకినాడకు( Kakinada) చెందిన హుడా మధుసూదన్ రావు కెనడాలో ఉంటున్నారు. అతనిపై 2022లో భార్య వరకట్నం కేసు పెట్టింది. దీనిపై పోలీసులు విచారణ చేసి కోర్టులో చార్జ్ షీట్ వేశారు. మధుసూదన్ రావు పై లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు. 2024 ఫిబ్రవరి 16న ఆయన ఇండియాకు రాగానే అరెస్ట్ చేశారు. కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. పాస్పోర్టును సైతం కోర్టుకు అప్పగించారు. అయితే పాస్పోర్ట్ తనకు అప్పగించాలని మధుసూదన్ రావు హైకోర్టును ఆశ్రయించారు కానీ నిరాకరించింది. మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. దీనిపై మధుసూదన్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఇద్దరు రాజీకి ఒప్పుకున్నారు. భర్త కుమారుడి కోసం రూ.45 లక్షలు ఇవ్వడానికి అంగీకరించారు. దీంతో సుప్రీంకోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే ఈ కేసు విచారణలో భాగంగా గతంలో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ ఇద్దరి మధ్య రాజీ కుదిరిచ్చే ప్రయత్నంలో భాగంగా తెలుగులో మాట్లాడారు. ఇప్పుడు తాజా విచారణలో సైతం జస్టిస్ భట్టి కూడా అదే విధంగా తెలుగులో మాట్లాడడం విశేషం.
* తెలుగులోనే వివరాల సేకరణ..
కాకినాడ దంపతులకు సంబంధించిన విడాకుల కేసు విచారణ నిన్ననే సాగింది. ఈ కేసును జస్టిస్ భట్టి( justice Bhatti) , జస్టిస్ ఆహాసనుద్దీన్ అమానుల్లాలా ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ భట్టి కోర్టుకు వచ్చిన దంపతులతో తెలుగులో మాట్లాడారు. వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిందని.. విడిపోవడానికి తాను సిద్ధమని భార్య చెప్పడంతో పోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే తెలుగులో మాట్లాడిన జస్టిస్ భట్టి తెలుగు వారు కావడం గమనార్హం. ఆయన అసలు పేరు సరపా వెంకటనారాయణ భట్టి. ఆయనది చిత్తూరు జిల్లా మదనపల్లి. గతంలో హైకోర్టులో సైతం న్యాయమూర్తిగా పనిచేశారు. ఏదైతేనేం సుప్రీంకోర్టులో ఒక న్యాయమూర్తి తెలుగులో మాట్లాడడం మాత్రం ప్రాధాన్యతను సంతరించుకుంది.