YS Jagan Mohan Reddy : ఏపీ ప్రభుత్వం( AP government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ కు చెందిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్( Saraswati power industries) కోసం కొనుగోలు చేసిన భూముల్లో ప్రభుత్వ, అసైన్డ్ భూములు ఉన్నట్లు కథనాలు వచ్చాయి. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకున్నారు. సంబంధిత భూములను కూడా పరిశీలించారు. అయితే ఇప్పుడు ఆ భూముల్లో ఉన్న అసైన్డ్ ల్యాండ్స్, రిజిస్ట్రేషన్ లను అధికారులు తాజాగా రద్దు చేశారు. ఈ మేరకు మాచవరం తహసిల్దార్ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. అప్పుడెప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సరస్వతి పవర్ కంపెనీకి వందల ఎకరాల భూములను కేటాయించారు. అది వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ ఆస్తిగా పేర్కొన్నారు. అయితే తనకు చెందిన వాటాలను కుమార్తె షర్మిల కు బదలాయించారు వైయస్ విజయమ్మ. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జగన్ కోర్టును ఆశ్రయించడం సంచలనం రేకెత్తించింది. ఈ తరుణంలో ఈ భూముల వ్యవహారంలో చెలరేగిన వివాదంతో.. ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏకంగా ఆ భూములను పరిశీలించారు. ఇప్పుడు ఆ భూముల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం.
* తక్కువ ధరకు కొనుగోలు
అప్పట్లో మేఘవరం , పిన్నెల్లి, చెన్నపాలెం, తంగెడ గ్రామాల్లో 125 ఎకరాలను సరస్వతీ పవర్ ప్లాంట్ యాజమాన్యం రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసింది. అయితే ఇటీవల వైయస్సార్ కుటుంబంలో ఈ భూముల విషయమై వివాదం ఏర్పడింది. ఆ సమయంలో వాటిలో అటవీ భూములు కూడా ఉన్నాయన్న వివాదం తెరపైకి వచ్చింది. దీంతో పవన్ కళ్యాణ్( Pawan Kalyan) స్పందించాల్సి వచ్చింది. అటవీ శాఖ మంత్రిగా సమగ్ర దర్యాప్తును ఆదేశించారు పవన్. దీంతో అధికారులు పూర్తిస్థాయి నివేదికను సమర్పించడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది.
* ఆ 24 ఎకరాలు
ప్రధానంగా మాచవరం( machuvaram ) మండలం మేఘవరంలో 20 ఎకరాలు, పిన్నెల్లిలో 4.84 ఎకరాలు అసైన్డ్ భూములను తప్పుగా రిజిస్ట్రేషన్ చేశారని.. అందువల్ల ఆ దస్తావేజులను రద్దు చేస్తున్నామని.. అందుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్కు విన్నవించామని.. అదే సమయంలో ఈ భూముల రిజిస్ట్రేషన్ రద్దుకు సబ్ రిజిస్ట్రార్కు నివేదించినట్లు తాహసిల్దార్ తెలిపారు. అయితే అధికారుల దర్యాప్తులో కేవలం అసైన్డ్ భూములు మాత్రమే ఉన్నట్లు తేలింది. అటవీ భూములు ఏవి దొరకనట్లు తెలుస్తోంది. అయితే అటు కలెక్టర్, ఇటు సబ్ రిజిస్టర్ అసైన్డ్ భూముల రద్దుకు ఆదేశాలు ఇవ్వడంతో.. తాహసిల్దార్ ఈ ప్రత్యేక ప్రకటన చేశారు.
* అప్పట్లో వందల ఎకరాలు
జగన్ కు ( Jagan Mohan Reddy) చెందిన సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ కు పల్నాడు జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వందల ఎకరాలు కేటాయించారు. అప్పట్లో నిబంధనలు పాటించలేదన్న విమర్శలు ఉన్నాయి. అయితే జగన్ సీఎం అయిన తర్వాత ఈ సొంత కంపెనీకి మరింత మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. పర్యావరణ శాఖను తప్పుదోవ పట్టించి ఎప్పటికప్పుడు అనుమతులు పునరుద్ధరించుకున్నారని అధికారుల పరిశీలనలో సైతం బయటపడినట్లు తెలుస్తోంది. అప్పట్లో వీటిలో ప్రభుత్వ భూములు కూడా ఉన్నట్లు ప్రచారం నడిచింది. అయితే ఎట్టకేలకు అసైన్డ్ భూములు 24 ఎకరాలు వరకు ఉన్నట్లు నిర్ధారణ అయింది. మున్ముందు సరస్వతి పవర్ కంపెనీ విషయంలో కూటమి ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది.