Fake Votes : ఏపీలో 10 లక్షల బోగస్ ఓట్లు.. ఎవరికి చేటు

ఈ బోగస్ వ్యవహారం మీదంటే మీది అని అధికార, ప్రధాన విపక్షం ఆరోపించుకుంటున్నాయి. అటు ఎల్లో, నీలిమీడియాలు సైతం కలహించుకుంటున్నాయి.

Written By: Dharma, Updated On : June 30, 2023 10:18 am
Follow us on

Fake Votes : ఏపీలో కట్టలు తెంచుకున్న బోగస్ ఓట్లు.. ఒకే ఇంటి నంబరుతో వందలకొలదీ ఓట్లు..తప్పుడు ధ్రువీకరణతో ఓట్లు.. చనిపోయిన వారి పేరిట ఓట్లు.. గత కొద్దిరోజులుగా వినిపిస్తున్న మాటలివి. ఈ బోగస్ వ్యవహారం మీదంటే మీది అని అధికార, ప్రధాన విపక్షం ఆరోపించుకుంటున్నాయి. అటు ఎల్లో, నీలిమీడియాలు సైతం కలహించుకుంటున్నాయి. ప్రత్యేక కథనాలు రాస్తున్నాయి. అయితే ఇందులో ఏది నిజమో తేల్చుకోలేక సగటు పాఠకుడు సతమతమవుతున్నాడు. ప్రజలు సైతం సరైన నిర్థారణకు రాలేకపోతున్నారు. అటు ఎన్నికల కమిషన్ సైతం స్పష్టంగా తప్పు ఎక్కడ జరిగిందో చెప్పలేకపోవడం విచారకరం.

కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ప్రత్యేక ఓటు సవరణ, ఆధార్ సీడింగ్ చేపడుతోంది. దీంతో ఏపీలో పెద్దఎత్తున బోగస్ ఓట్లు బయటపడుతున్నాయి. ఇవన్నీ ఓటమి భయంతో వైసీపీయే చేయిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. గతంలో చంద్రబాబు హయాంలోనే ఓట్లు నమోదయ్యాయని.. ఇప్పుడు వాటిని తొలగించాల్సి రావడంతో టీడీపీ గోల చేస్తోందని వైసీపీ కౌంటర్ అటాక్ ఇస్తోంది. దీనిపై టీడీపీ న్యాయపోరాటం చేస్తోంది. ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది. దీంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళుతుందని భావించిన వైసీపీ సైతం స్వరం పెంచుతోంది. అనుకూల మీడియాలో టీడీపీ హయాంలో జరిగిన తప్పిదంగా చూపించే ప్రయత్నం చేస్తోంది.

సమగ్ర కేస్ స్టడీస్ తో ఈనాడు, ఆంధ్రజ్యోతిలో బోగస్ ఓట్లుపై కథనాలు వచ్చాయి. ఏకంగా లక్షల ఓట్లను అక్రమంగా చేర్పించారని.. టీడీపీ సానుభూతిపరుల ఓట్లను అకారణంగా తొలగిస్తున్నారని చెబుతూ సమగ్ర కథనాలను ప్రచురించాయి. గత ఎన్నికల నాటి ముందున్న పరిస్థితులు, నాడు టీడీపీ బీజేపీతో కయ్యం పెట్టుకోవడం, వ్యూహకర్త పీకే పాచికలతో టీడీపీ ఓట్ల తొలగింపు, పక్క రాష్ట్రాలకు చెందిన వారిని కొత్తగా ఓట్ల నమోదు వంటి వాటిపై ప్రత్యేక కథనాలు వెలువడ్డాయి. ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతో చేస్తున్నవే అంటూ కథనాల్లో చెప్పే ప్రయత్నం చేశారు.

అయితే దీనిపై జగన్ సాక్షి మీడియా కౌంటర్ అటాక్ ఇస్తోంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తొలగించిన పది లక్షల ఓట్లు చంద్రబాబు హయాంలో నమోదుచేసినవేనని ఆరోపించారు. అవన్నీ టీడీపీ సానుకూల ఓట్లు కావడంతోనే గగ్గోలు పెడుతున్నారని.. ఒక్క కుప్పంలోనే ఈ విధంగా 36 వేల ఓట్లు నమోదుచేశారని..అందుకే చంద్రబాబు గత ఎన్నికల్లో గట్టెక్కగలిచారని కథనం సారాంశం. అప్పట్లో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఐటీ గ్రిడ్ ద్వారా టీడీపీ తస్కరించిందని.. అది టీడీపీ సేవామిత్ర యాప్ కు చేరిందని.. సర్వే చేసి టీడీపీకి ఓటు వేయని వారి ఓట్లను ఫారం 7 ద్వారా తొలగించారని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే గత ఎన్నికల ముందు పీకే టీమ్ ద్వారా ఫారం 7 దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడవే ఆరోపణలు టీడీపీపై రావడం, సాక్షిలో కథనం రావడం అనుమానాలకు తావిస్తోంది. అయితే ఈ పరిణామాలతో ఏది నిజమో తెలియక ఏపీ ప్రజలు సతమతమవుతున్నారు.