South Central Railway : ఆ 23 రైల్వేస్టేషన్లలో ఏ రైలూ ఆగదిక..

ప్రైవేటు రైళ్లు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలోనే స్టేషన్లను ఎత్తివేస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీకి ప్రత్యేక రైల్వేజోన్ ప్రకటించడం జాప్యం జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న రైల్వేస్టేషన్లను సైతం ఎత్తివేస్తుండడం విచారకరం. 

Written By: Dharma, Updated On : June 30, 2023 9:35 am
Follow us on

South Central Railway : దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైలు ప్రయాణికులకు చేదు వార్త చెప్పింది. ఏకంగా 23 రైల్వేస్టేషన్లు మూసివేయనున్నట్టు ప్రకటించింది. ఇక నుంచి అక్కడ ఏ రైళ్లు ఆగవు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని సైతం ఇతర ప్రాంతాలకు బదిలీ చేసింది. ప్రయాణికుల ఆదరణ తగ్గుముఖం పట్టడమే కారణంగా చెబుతోంది. దీంతో ఆ రైల్వేస్టేషన్లన్నీ బోసిపోతూ కనిపించాయి. ఇండియన్ రైల్వే ప్రయాణికుల సేవల కంటే కమర్షియల్ అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రధానంగా కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల్లోని సుదీర్ఘ చరిత్ర ఉన్న రైల్వేస్టేషన్లు తొలగింపు జాబితాలో ఉన్నాయి. ఎప్పుడో బ్రిటీష్ కాలంలో ఏర్పాటైన ఈ స్టేషన్లు పరిసరాల్లో వందల గ్రామాల ప్రజల రాకపోకలకు, వస్తు రవాణాకు దోహదపడ్డాయి. అటువంటి స్టేషన్లను ఆదాయం, ప్రయాణికుల ఆదరణ సాకుగా చూపి మూసివేస్తుండడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైల్వేశాఖ ఉన్నతాధికారుల తీరును తప్పుపడుతున్నారు. ఈ విషయంలో అధికార పార్టీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరుతున్నారు.

సౌత్ సెంట్రల్ లోని అల్లూరు రోడ్డు, బాదంపూడి, బయ్యవరం, చాగల్లు, దెందులూరు, హంసవరం, ముస్తాబాద, నవాబ్ పాలెం, పెన్నాడ అగ్రహరం, పెద అవుటపల్లి, రావికంపాడు, తాడి, శ్రీ వెంకటేశ్వరపాలెం, తాలమంచి, తేలప్రోలు, వట్లూరు రైల్వే స్టేషన్లను మూసివేశారు.  కొలనుకొండ, వీరవల్లి, ఉంగుటూరు, బ్రాహ్మణ గూడెం, బలభద్రపురం, తిమ్మాపురం, చింతపర్రు స్టేషన్లు ఈ తొలగింపు జాబితాలో ఉన్నాయి. కనీసం రోజుకు 25 మంది ప్రయాణికులు రాకపోవడంతోనే స్టేషన్లను మూసివేసినట్టు అధికారులు ప్రకటించారు.

ఇండియన్ రైల్వే ప్రైవేటీకరణలో భాగంగానే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం రైలుమార్గాలను ప్రైవేటీకరిస్తూ.. ప్రైవేటు రైళ్లు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలోనే స్టేషన్లను ఎత్తివేస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీకి ప్రత్యేక రైల్వేజోన్ ప్రకటించడం జాప్యం జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న రైల్వేస్టేషన్లను సైతం ఎత్తివేస్తుండడం విచారకరం.