Jogi Ramesh: జైలా? బెయిలా? జోగి రమేష్ కు ఈరోజు కీలకం!

గత ఐదేళ్ల వైసిపి పాలనలో చాలామంది నేతలు అడ్డగోలుగా వ్యవహరించారు. రాజకీయ ప్రత్యర్థులను వెంటాడారు. వేటాడే ప్రయత్నం చేశారు. అధికారం తారుమారు కావడంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

Written By: Dharma, Updated On : September 12, 2024 9:33 am

Jogi Ramesh

Follow us on

Jogi Ramesh: వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇటీవలే ఆయన కుమారుడు అరెస్టయ్యారు. అగ్రిగోల్డ్ భూములను అడ్డగోలుగా కొనుగోలు చేసి అడ్డంగా బుక్కయ్యారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ భూములను చౌకగా కొట్టేశారని జోగి రమేష్ కుమారుడిపై ఉంది అభియోగం. అయితే కొద్ది రోజులకే ఆయనకు బెయిల్ లభించింది. ఇప్పుడు మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ప్రధానంగా నేటి సీఎం, నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై జోగి రమేష్ దండయాత్ర చేశారు. నాటి జగన్ సర్కార్ పై చంద్రబాబు విమర్శలు చేశారని ఆగ్రహిస్తూ వందలాది వాహనాలతో కృష్ణానది కరకట్టలపై భారీ ప్రయోగం చేశారు. చంద్రబాబు ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పట్లో పోలీస్ శాఖ చిన్నచిన్న కేసులతో సర్దుబాటు చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ కేసు తెరపైకి వచ్చింది. మాజీమంత్రి జోగి రమేష్ అరెస్టుకు రంగం సిద్ధమైంది.

* ముందస్తు బెయిల్ నిరాకరణ
అయితే జోగి రమేష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల తర్వాత బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు తేల్చేసింది. వారం రోజులు పాటు అరెస్టు విషయంలో మినహాయింపు అడిగినా కోర్టు నిరాకరించింది. దీంతో జోగి రమేష్ అరెస్టు కాక తప్పని పరిస్థితి ఎదురైంది. ఆయన కోసం ప్రత్యేక పోలీసు బృందాలు జల్లెడ పడుతున్నాయి. కానీ వారికి దొరకకుండా జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

* అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్
జోగి రమేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.ముందస్తు బెయిల్ పిటిషన్ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. గురువారం నాడు ఆ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. అత్యున్నత న్యాయస్థానంలో తనకు ముందస్తు బెయిల్ లభిస్తుందని జోగి రమేష్ నమ్మకంతో ఉన్నారు. అయితే వ్యతిరేకంగా తీర్పు వస్తే మాత్రం ఆయన ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవడం తప్పదు. ఇప్పటికే పోలీస్ బృందాలు ఆయన కోసం గాలిస్తున్నాయి. రేపు కానీ సుప్రీంకోర్టులో వ్యతిరేక తీర్పు వస్తే తనంతట తానుగా జోగి రమేష్ లొంగిపోయే అవకాశం ఉంది. ఒకవేళ ముందస్తు బెయిల్ లభిస్తే మాత్రం ఆయనకు ఉపశమనం లభించినట్టే.

* చంద్రబాబు ఇంటిపై దండయాత్ర
వైసిపి హయాంలో జోగి రమేష్ దూకుడుగా వ్యవహరించేవారు.2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో తనకు మంత్రి పదవి దక్కుతుందని రమేష్ భావించారు. కానీ జగన్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో కొద్దిపాటి నిరాశకు గురయ్యారు జోగి రమేష్. జగన్ పై ఈగ వాలనిచ్చేవారు కాదు.జగన్ సర్కార్ పై చంద్రబాబు విమర్శలు చేశారని ఆయన ఇంటిపై దండయాత్ర చేశారు.అక్కడకు కొద్ది రోజులకే జోగి రమేష్ కు మంత్రి పదవి ఇచ్చారు జగన్. అప్పటినుంచి ప్రత్యర్థులపై రెచ్చిపోతూ వచ్చారు జోగి రమేష్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. రేపు సుప్రీంకోర్టులో వచ్చే తీర్పు బట్టి ఆయన భవితవ్యం ఉండనుంది.