Chandrababu : కడప అంటేనే ముందుగా గుర్తొచ్చేది వైఎస్ కుటుంబం. ఆ కుటుంబానికి చెక్కుచెదరని అభిమానం కడప జిల్లాలో సొంతం. అటువంటి జిల్లాలో ఈసారి పట్టు సాధించింది తెలుగుదేశం పార్టీ కూటమి. పది అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఏడు స్థానాల్లో విజయం సాధించింది. టిడిపి ఆవిర్భావం నుంచి గతం ఎన్నడు ఇటువంటి విజయాన్ని ఆ పార్టీ చూడలేదు కడప జిల్లాలో. అందుకే ఈ పట్టును నిలుపుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకోసం ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. వాస్తవానికి ఎన్నికల్లో వైసిపి ఓడిపోయింది. కానీ 40% ఓటు బ్యాంకు ఆ పార్టీ సాధించింది. అంటే ఇప్పటికీ వైసిపి అంటే అభిమానించే శ్రేణులు ఉన్నాయి. అందుకే ఎలాగైనా వైసీపీ ఓటింగ్ శాతం తగ్గించాలని.. జగన్ ఆత్మస్థైర్యం పై దెబ్బ తీయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఆ పార్టీ కీలక నేతలు తమంతట తాము పార్టీని విడిచి పెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. కేంద్రంలో ఉన్న బిజెపిని వాడుకుంటున్నారు ఈ విషయంలో. అదే సమయంలో వైసీపీకి కలిసివచ్చే అంశాలను నిర్వీర్యం చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే కడప జిల్లాలో మహానాడు ఏర్పాటుకు సిద్ధపడ్డారు.
* కడపలో మహానాడు
తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద కార్యక్రమం మహానాడు. పార్టీ ఆవిర్భావం నుంచి ఏటా మహానాడు వేడుకగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మూడు రోజుల జరిగే ఈ కార్యక్రమంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన అంశాలపై చర్చిస్తారు. తీర్మానాలు చేసి ఆమోదిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి ఊపిరి పోసేది మహానాడు. 2019 ఎన్నికల్లో టిడిపి దారుణంగా ఓడిపోయింది. కానీ ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసిన మహానాడు పార్టీ పరిస్థితిని మార్చేసింది. అప్పటివరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందా అన్న అనుమానం ఉండేది. కానీ దానిని పటా పంచలు చేసింది ప్రకాశం జిల్లాలో ఏర్పాటుచేసిన మహానాడు. అంతటి మహానాడు ను కడప జిల్లాలో ఏర్పాటు చేయాలని చంద్రబాబు భావించడం వెనుక భారీ స్కెచ్ ఉన్నట్లు తెలుస్తోంది.
* మసకబారిన చరిత్ర
కడప జిల్లా అంటే ముందుగా గుర్తొచ్చేది వైయస్ కుటుంబం. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం ఆ కుటుంబ చరిత్ర మసకబారింది అని చెప్పవచ్చు. రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో తలెత్తిన విభేదాలు, వివేకానంద రెడ్డి హత్య అంశం కుదిపేసింది. ఈ ఎన్నికల్లో కడప జిల్లాలో వైసీపీ ఓడిపోవడం అనేది ఒక రికార్డ్. అందుకే వైసిపి పుంజుకోకుండా ఉండాలంటే చంద్రబాబు తన బుర్రకు మరింత పదును పెడుతున్నారు. అందులో భాగంగా కడప జిల్లాలో మే 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రం యావత్ పసుపు శ్రేణులు కడప జిల్లాకు చేరుకునేలా ప్లాన్ చేస్తున్నారు.
* వైసిపి పని అయిపోయిందన్న సంకేతాలు
వైసిపి పని అయిపోయిందని చెప్పడమే చంద్రబాబు లక్ష్యంగా తెలుస్తోంది. 2029 ఎన్నికల్లో జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారని వైసీపీ శ్రేణులు ఆశాభావంతో ఉన్నాయి. అటు వైసిపి నేతల ప్రకటనలు కూడా అలానే ఉన్నాయి. అయితే ఇప్పుడిప్పుడే వైసీపీ కీలక నేతలపై పట్టు బిగిస్తోంది కూటమి. బిజెపి ద్వారా వారిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే విజయసాయిరెడ్డి రాజీనామా. ఆయన ఏకంగా రాజకీయాలకు దూరమవుతున్నట్లు ప్రకటించారు. ఇంకా చాలామంది వైసిపి కీలక నేతలు బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఒకవైపు కూటమి కేసులతో ఉక్కు పాదం మోపుతోంది. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సైతం తన ప్రతాపాన్ని చూపుతోంది.
* భారీగా జన సమీకరణ
కడప జిల్లాలో జరిగే మహానాడుకు భారీగా జన సమీకరణ చేయాలని తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేస్తోంది. కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం ద్వారా జగన్ కు గట్టి సమాధానం చెప్పాలని భావిస్తోంది. జగన్ సొంత జిల్లాలో భారీగా జనాలను చూపించి ఇక వైసిపి పని అయిపోయిందని సంకేతాలు ఇచ్చేలా.. చంద్రబాబు భారీ ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు కోస్తాంధ్ర నుంచి, ఉత్తరాంధ్ర నుంచి భారీగా జనాలను సమీకరించాలన్నది ప్రణాళిక. తద్వారా కడప నడిబొడ్డున సౌండ్ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.