Vande Bharat Express: దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్ల శకం ప్రారంభమైంది. అత్యాధునిక హంగులతో, గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే వందే భరత్ రైళ్లు భారత దేశ దశ దిశను మార్చుతాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. విమానం తరహాలో ప్రయాణ అనుభూతిని కలిగించే ఈ రైళ్లలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. హైదరాబాద్ విశాఖ, విశాఖ,తిరుపతి, కాచిగూడ,చెన్నై మార్గాల్లో వందే భారత్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే ఇంతటి గరిష్ట వేగంతో కూడిన రైళ్లను ప్రారంభించడం హర్షించదగ్గ పరిణామమే అయినా.. రైల్వే పరంగా ఉన్న సమస్యలను పరిష్కరించకుండా.. అత్యధిక వేగంతో కూడిన రైళ్ళను ప్రవేశపెట్టడం ప్రమాదకరమని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. గత మూడు రోజులుగా అనంతపురం స్టేషన్ మీదుగా వందే భారత్ రైలు రాకపోకలు ప్రారంభమయ్యాయి. కానీ అనంతపురం నగరంలోని లక్ష్మీ నగర్ రైల్వే సెల్లార్ పెచ్చులూడి పడుతుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెండు దశాబ్దాల కిందట నగరవాసులు రాకపోకలు సాగించేందుకు వీలుగా రైల్వే సెల్లార్ను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు వేలాదిమంది ఈ సెల్లార్ కింద నుండే ప్రయాణాలు చేస్తుంటారు. కానీ ప్రస్తుతం ఈ సెల్లార్ పూర్తిగా శిథిలావస్థకు చేరింది. సాధారణ రైళ్లు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినప్పుడే శబ్ద, వాయు కాలుష్యం విపరీతంగా ఉంటుంది. బ్రిడ్జి కింద ప్రాంతం సైతం దెబ్బతినడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గత మూడు రోజులుగా వందే భారత్ రైలు అతి వేగంతో ప్రయాణిస్తుండటంతో సెల్లార్ పెచ్చులూడి కింద వాహనదారులపై పడుతున్నాయి.
అనంతపురం నగరాన్ని వేరు చేస్తూ ఈ రైల్వే బ్రిడ్జి ఉంటుంది. ఉదయం సాయంత్రం వేళల్లో రద్దీగా మారుతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు రాకపోకలు సాగిస్తుంటారు. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన వారు ఇదే మార్గం గుండా వెళ్తుంటారు. కానీ బ్రిడ్జి చూస్తే దారుణంగా తయారైంది. వందే భారత్ రైలు దాటికి పెచ్చులూడి పడుతుండడంతో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం రైల్వే అధికారులు ఈ బ్రిడ్జి పరిస్థితిని తెలుసుకోకుండా.. అతివేగంతో కూడిన రైళ్లను ఎలా అనుమతిస్తారని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు.
ఇదే మార్గం గుండా జిల్లా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు వెళుతుంటారు. కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం నగర మేయర్ వసీం సైతం నగరపాలక సంస్థ కార్యాలయానికి వెళ్లాలంటే ఇదే మార్గం. కానీ ఆయన సైతం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. రేపు పొద్దున్న జరగరానిది.. ఏమైనా జరిగితే.. ఎవరు బాధ్యత వహిస్తారు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 180 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే రైలు విషయంలో ఎందుకు జాగ్రత్తలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తక్షణం రైల్వే ఉన్నతాధికారుల స్పందించి ఈ సెల్లార్ను ఆధునికరించాలని.. ఆ తరువాతే వందే భారత్ రైలు రాకపోకలకు అనుమతి ఇవ్వాలని అనంతపురం నగరవాసులు రైల్వే శాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు.