Nagababu: ఇటీవల రాజకీయ పార్టీల్లో వింత పోకడ కనిపిస్తోంది. వ్యూహ కర్తలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాగే పార్టీ వాయిస్ ను బలంగా వినిపించేవారు వీరికి తోడు అవుతున్నారు. ఇక సీనియర్ జర్నలిస్టులు, యూట్యూబర్లు ఆయా పార్టీలకు అనుకూలంగా విశ్లేషణలు ఇస్తున్నారు. కొందరైతే ఏకంగా సర్వేల పేరిట హల్చల్ చేస్తున్నారు. అందుకే నెటిజన్లు సైతం ఇటువంటి వారిని లైట్ తీసుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో కొద్దిమంది చేసే అతి అయా రాజకీయ పార్టీలకు ఇబ్బందికరంగా మారుతోంది. తాజాగా జనసేన కీలక నేత నాగబాబు ఇటువంటి వారి విషయంలో ప్రత్యేకంగా ప్రకటన జారీ చేయాల్సి వచ్చింది.
తెలుగుదేశం పార్టీకి మహాసేన రాజేష్ ఉన్నట్టే.. జనసేనకు కళ్యాణ్ దిలీప్ సుంకర అనే న్యాయవాది ఉన్నారు. జనసేన విషయంలో చాలా స్పీడ్ గా రియాక్ట్ అవుతారు. అయితే ఆయన జనసేనకు మేలు చేస్తున్నాడో.. కీడు చేస్తున్నాడో తెలియదు కానీ.. పవన్ తీసుకున్న నిర్ణయాలను సైతం వ్యతిరేకిస్తుండడం రచ్చకు దారితీస్తోంది. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పొత్తుల నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్న వారికి నాగబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడకుండా.. సోషల్ మీడియాలో బయట గొడవలు పెట్టుకుని పార్టీకి చెడ్డ పేరు తెస్తే సహించేది లేదని నాగబాబు హెచ్చరించారు. అయితే కేడిఎస్ గా పిలుచుకునే కళ్యాణ్ దిలీప్ సుంకర కూడా ఇటీవలే అటువంటి వ్యాఖ్యలు చేశారు. దీంతో నాగబాబు వార్నింగ్ కేడీఎస్కే అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి కేడిఎస్ జనసేనలో యాక్టివ్ మెంబర్ కాదు. పవన్ కళ్యాణ్ సైతం అంత చనువు ఇవ్వలేదు. ఆయనకు పార్టీ బాధ్యతలు ఎప్పుడూ అప్పగించలేదు. ఆయన మాత్రం జనసేన హార్డ్ కోర్ ఫ్యాన్ గా చెప్పుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అగ్రెసివ్ గా జనసేనకు అనుకూలంగా వీడియోలు పెడుతుంటారు. అయితే ఈ క్రమంలో తన వ్యక్తిగత వైరాన్ని జనసేనకు అంటగడుతుంటారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మహాసేన రాజేష్ తో కేడిఎస్ కు పడదు. రాజేష్ టిడిపిలో చేరారు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని ప్రకటించారు. అవినీతి కేసుల్లో ఇటీవల చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలో కేడిఎస్ సోషల్ మీడియాలో పెట్టిన వీడియోలు వైరల్ అయ్యాయి. పొత్తులపై కామెంట్స్ చేయడంతో పాటు చంద్రబాబు అరెస్టుపై సైతం అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో టిడిపి జనసేనల మధ్య విభిన్న వాతావరణం నెలకొంది. దీనిని గుర్తించిన జనసేన నాయకత్వం.. ఇటువంటి వారు జాగ్రత్తగా వ్యాఖ్యలు చేయాలని స్పష్టమైన హెచ్చరికలు జారీచేసింది.
కళ్యాణ్ దిలీప్ సుంకర న్యాయవాది. ఈయన అప్రకటిత జనసేన నేత అంటూ ఒక కామెంట్ ఉంది. అయితే ఆయన జనసేనకు మద్దతుగా చేసే వీడియోలు కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అదే సమయంలో జనసేనకు డ్యామేజ్ చేస్తుంటాయని టాక్ ఉంది. ఈయన వైసీపీ నేత వర్రా రవీంద్ర రెడ్డికి మంచి స్నేహితుడు. రవీంద్ర రెడ్డి సైతం సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడానికి ముందుంటారు. ఇటీవల పవన్ పొత్తు ప్రకటన తర్వాత రవీంద్ర రెడ్డి చాలా రకాలుగా వ్యాఖ్యలు చేశారు. ఇటు కేడిఎస్ సైతం దానికి దగ్గరగా ఉన్న కామెంట్స్ చేశారు. దీంతో జనసేన నాయకత్వంలో సైతం ఒక రకమైన అనుమానం ఏర్పడింది. అందుకే నాగబాబు నేరుగా రియాక్ట్ అయ్యారని తెలుస్తోంది.
Recommended Video:
