Chandrababu Bihar election strategy: దేశ రాజకీయాల్లో విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్టు ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య గట్టి పోటీ ఉంది. సంఖ్యా బలం ఎన్డీఏ కూటమికి అధికంగా ఉన్నా.. క్రాస్ ఓటింగ్ పై ఇండియా కూటమి ఆశలు పెట్టుకుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తే బిజెపికి ముచ్చెమటలు పట్టించవచ్చన్నది కాంగ్రెస్ ఆలోచన. అయితే వరుసగా బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాంలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని మట్టి కరిపిస్తే ప్రధాని మోదీ హవాను పూర్తిగా తగ్గించవచ్చని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఆలోచన చేస్తోంది. అందుకే ఆయా రాష్ట్రాల్లో మిత్రపక్షాల నుంచి వచ్చే విజ్ఞప్తుల మేరకు కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే బీహార్లో ఇప్పుడు ఎన్డీఏ గెలవడం కీలకం. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ నెగ్గాలని.. నగకపోతే కఠిన పరిస్థితులు ఎదురవక తప్పదని బిజెపి ఒక అంచనాకు వచ్చింది. అదే సమయంలో ఇండియా కూటమి అక్కడ పట్టు బిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎన్డీఏ చంద్రబాబు సాయాన్ని కోరినట్లు తెలుస్తోంది. ప్రధానంగా నితీష్ కుమార్ తన స్నేహితుడు చంద్రబాబు సలహాలు, సూచనలు కోరినట్లు ప్రచారం జరుగుతోంది.
మోడీ కంటే సీనియర్..
ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో చంద్రబాబు(AP CM Chandrababu) సీనియర్. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోడీ కంటే ఆయన అనుభవిజ్ఞుడు. దీనిని మోడీ సైతం అంగీకరిస్తారు. ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబుకు దూరమయ్యారే తప్ప.. ఆయన అనుభవాన్ని మాత్రం ప్రధాని మోదీ సైతం గౌరవిస్తారు. అలాగే చంద్రబాబుకు సమకాలీకుడు నితీష్ కుమార్. ఇప్పుడు అదే నితీష్ కుమార్ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి బీహార్లో అధికారంలో ఉంది. అందుకే మరోసారి గెలిచేందుకు నితీష్ కుమార్ చంద్రబాబును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్డీఏలో చంద్రబాబు కీలక భాగస్వామి కావడంతో.. బిజెపి పెద్దలు సైతం చంద్రబాబుకు బీహార్ ఎన్నికల బాధ్యతను అప్పగించినట్లు తెలుస్తోంది.
ప్రత్యేక నివేదిక..
బీహార్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు ఇప్పటికే నితీష్ కుమార్ కు(Bihar CM Nitish Kumar) ఒక నివేదిక ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా ఏపీ ఎన్నికల్లో సక్సెస్ ఫార్ములా గా ఉన్న మహిళల పథకాలను.. వేర్వేరుగా బీహార్ ఎన్నికల్లో సైతం ప్రయోగించాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం. మహిళలకు వీలైనన్ని పథకాలు ప్రారంభిస్తే.. ప్రజలు తప్పకుండా నమ్ముతారని.. మరోసారి బీహార్లో ఎన్డీఏ అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు తేల్చి చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. అందులో భాగంగానే తాజాగా నితీష్ కుమార్ మహిళలను ఉద్దేశించి ఒక పథకాన్ని ప్రారంభించారు. ప్రతి కుటుంబంలో మహిళ బ్యాంక్ ఖాతాలో పదివేల రూపాయలను జమ చేశారు. స్వయం ఉపాధి రంగంలో 6 నెలల కాలంలో అభివృద్ధి చేసి చూపిస్తే 2 లక్షల రూపాయలు సాయం చేసే పథకానికి శ్రీకారం చుట్టారు. అది ఏపీ సీఎం చంద్రబాబు సూచించిన పథకం అని తెలుస్తోంది. ఆ ఒక్క పథకం తోనే నితీష్ కుమార్ మహిళల ఓట్లు కొల్లగొడుతారని అక్కడ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చంద్రబాబుకు ఎనలేని గౌరవం..
వాస్తవానికి జాతీయస్థాయిలో చంద్రబాబుకు పరిచయాలు ఎక్కువ. ఈ ఒక్క కారణంతోనే కేంద్ర పెద్దలు సైతం చంద్రబాబు విషయంలో ప్రత్యేక గౌరవం ఇస్తున్నారు. ఇప్పుడు ఎన్డీఏ తరఫున బీహార్ ఎన్నికల బాధ్యతను చంద్రబాబుపై పెట్టినట్లు తెలుస్తోంది. ఇదే విషయంలో ఇండియా కూటమి భయపడుతోంది. నితీష్ కుమార్, నరేంద్ర మోడీ దూకుడుకు చంద్రబాబు ఆలోచనలు తోడైతే.. బీహార్లో ఇబ్బందికర పరిస్థితులు తప్పవని ఇండియా కూటమి నేతలు ఆందోళనతో ఉన్నారు. చూడాలి మరి బీహార్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో..