Amaravathi Capital  : ఐఐటి నిపుణుల నివేదికే అమరావతికి కీలకం.. ఉన్న వాటిని నిర్మిస్తారా? కొత్తవి చేపడతారా?

అమరావతి నిర్మాణానికి నిధులు సిద్ధమయ్యాయి.కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయలను మంజూరు చేసింది.కానీ గత ఐదేళ్ల కిందట నిర్మాణాలను కొనసాగించాలా? లేకుంటే కొత్తవి నిర్మించాలా? అన్నది తెలియాల్సి ఉంది.

Written By: Dharma, Updated On : August 4, 2024 1:00 pm
Follow us on

Amaravathi Capital : టిడిపి కూటమి ప్రభుత్వం అమరావతి పై ఫోకస్ పెట్టింది. ఫలితాలు వచ్చిన మరుక్షణం అమరావతికి కొత్త కల వచ్చింది. శరవేగంగా జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. వందలాది వాహనాలు, జెసిబి యంత్రాలతో ముళ్ళ కంపలను తొలగించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం స్పందించింది. అమరావతి రాజధాని నిర్మాణానికి బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. మరోవైపు అమరావతి నిర్మాణాలపై సీఆర్డీఏ అధికారులు ఒక నివేదిక రూపొందించారు. శాశ్వత జంగిల్ క్లియరెన్స్ పనులతో పాటు నిర్మాణాల్లో పేరుకుపోయిన నీటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. 33 కోట్ల రూపాయలతో శాశ్వత జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేసేందుకు సిద్ధపడ్డారు. ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేయనున్నారు. మరోవైపు ఐఐటి చెన్నై నిపుణుల బృందం అమరావతిలో పర్యటించింది. ఐఐటి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ మెహర్ ప్రసాద్, ఫౌండేషన్ ఎక్స్ పర్ట్ సుబ్ దీప్ బెనర్జీ, కొరోసన్ స్టడీస్ ఎక్స్ పర్ట్ రాధాకృష్ణ పిళ్లై తో కూడిన బృందం అమరావతిని సందర్శించింది. అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాలను పరిశీలించింది. గత ఐదేళ్ల వైసిపి పాలనలో అమరావతి పూర్తిగా నిర్వీర్యం అయ్యింది. చిట్టడవిని తలపిస్తోంది. ఐకానిక్ నిర్మాణాలన్నీ నీటిమడుగులో ఉండిపోయాయి. దీంతో వాటిని యధా స్థానానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే నిపుణుల కమిటీ అమరావతి నిర్మాణాలనుపరిశీలించింది.

* కొన్నేళ్లుగా నీటి మడుగులోనే
ఐకానిక్ నిర్మాణాలతోపాటు ర్యాఫ్టు ఫౌండేషన్ మొత్తం నీటిలోనే ఉండిపోయింది. అక్కడ పరిస్థితి చెరువును తలపిస్తోంది. దీంతో ఐఐటి నిపుణులు బోటును వినియోగించాల్సి వస్తోంది. జాతీయ విపత్తుల నిర్వహణ బలగాల సాయంతో బోట్ల ద్వారా అమరావతి నిర్మాణాలను పరిశీలించాల్సి వచ్చింది. అసంపూర్తిగా ఉన్న శాశ్వత సచివాలయ కట్టడం, వివిధ విభాగాధిపతుల కోసం ప్రతిపాదించిన ఐకానిక్ టవర్లకు చెందిన పిల్లర్లపై అధ్యయనం చేశారు.

* ఇనుము తుప్పుపట్టే అవకాశం
గత ఐదు సంవత్సరాలుగా పూర్తిగా నీటిలోనే ఉండిపోయాయి నిర్మాణాలు.దీంతోవాటి నిర్మాణంలో వినియోగించిన ఇనుము తుప్పు పట్టి ఉండొచ్చని అంచనా వేశారు.సుదీర్ఘకాలంగా నీటిలో నానుతుండడం వల్ల ఆయా కట్టడాల పునాదులు ఎంత మేరకు బలంగా ఉంటాయనేది అధ్యయనం చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు ఉన్న నిర్మాణాలను కొనసాగించాలా? కొత్త నిర్మాణాలు చేపట్టాలా? అన్నది నిపుణుల బృందం నిర్ధారించనుంది. అందుకే అక్కడ భూసార పరీక్షలు చేపట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

* పూర్వస్థితికి తేవాలని ప్రయత్నం
మరో రెండు నెలల్లో అమరావతిని పూర్వస్థితిలోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవైపు శాశ్వత జంగిల్ క్లియరెన్స్, మరోవైపు కట్టడాల స్థితిగతులను తెలుసుకోవాలన్న ప్రయత్నంలో ఉంది. ఈ రెండు కొలిక్కి వచ్చాక నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశం ఉంది. మొత్తానికి అయితే ఇప్పుడు ఐఐటీ నిపుణులు ఇచ్చిన నివేదిక అమరావతికి కీలకం కానుంది.