Komati Reddy Venkata Reddy: పవన్ కళ్యాణ్ పై( deputy CM Pawan Kalyan) విరుచుకుపడ్డారు తెలంగాణ నేతలు. తమ దిష్టి తగిలి కోనసీమ పాడయిందా అంటూ పవన్ కళ్యాణ్ పై విమర్శల దాడి కొనసాగించారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే పవన్ కళ్యాణ్ సినిమాలను ఆడనివ్వమని కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఆయన ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారు. ఏపీకి వచ్చిన ఆయన ఒక కీలక ప్రకటన చేశారు. ఆ సందర్భంలో అలా మాట్లాడాల్సి వచ్చిందని తేలిగ్గా తీసుకున్నారు. పనిలో పనిగా జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి వెళ్లాలని సలహా ఇచ్చారు. తెలంగాణతో పాటు ఏపీ అభివృద్ధి సాధించాలని తాము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. తద్వారా పవన్ కళ్యాణ్ వివాదాన్ని అలా ముగించారు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. ఎన్నెన్నో మాట్లాడుకుంటాం కానీ అవన్నీ సీరియస్ కాదు అన్నట్టు తేల్చేశారు.
* సీఎం చంద్రబాబుకు ఆహ్వానం..
తెలంగాణ ప్రభుత్వం తరఫున పారిశ్రామిక పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్( Global submit) పేరిట నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అయితే మంత్రివర్గంలో చాలామంది ఉన్నారు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే కొద్దిరోజుల క్రితం పవన్ కళ్యాణ్ పై వెంకట్ రెడ్డి విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాలను తెలంగాణలో ఆడనివ్వనని సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకంటే ముందే ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, అటు తరువాత మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీహరి వంటి వారు కూడా విమర్శలు చేశారు. అద్దంకి దయాకర్ సైతం పవన్ వ్యాఖ్యలను తప్పు పట్టారు. అయితే ఈ వివాదం ఎంత దాకా ముందుకు వెళ్తుందోనని ఆందోళన చెందారు అందరూ. కానీ ఏపీకి వచ్చి మరి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.
* అప్పట్లో దిష్టి వ్యాఖ్య..
అంబేద్కర్ కోనసీమ( Ambedkar konasima ) జిల్లాలో కొబ్బరి పంట సముద్ర ఉప్పు జలాలతో నాశనం అవుతూ వస్తోంది. ఆ కొబ్బరి తోటలను పరిశీలించారు పవన్ కళ్యాణ్. అంతకుముందు తెలంగాణ నేతలు కోనసీమ లాంటి ప్రాంతం తమ రాష్ట్రంలో లేదా అని చాలా సందర్భాల్లో బాధపడ్డారు. అయితే దానిని గుర్తు చేస్తూ పవన్ కళ్యాణ్ దిష్టి అనే వ్యాఖ్యలు చేశారు. దానిని పట్టుకుని రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు తెలంగాణ నేతలు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి పవన్ కళ్యాణ్ సినిమాలను తెలంగాణలో నిలిపివేస్తామని హెచ్చరించారు. కానీ మంత్రి ప్రకటనపై ఏపీ నుంచి ఎటువంటి కౌంటర్ లేదు. ఎవరు స్పందించలేదు కూడా. ఎందుకంటే ఏదో రాజకీయ ప్రయోజనాలను ఆశించి అలా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రకటించారన్న అనుమానాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏపీకి వచ్చి మరి దీనిపై క్లారిటీ ఇచ్చేశారు. ఏదో అలా మాట్లాడేసాను అంటూ తేలిగ్గా తీసుకున్నారు.
* రాజశేఖర్ రెడ్డి కి విధేయుడు..
రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత విధేయుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి( Komatireddy Venkat Reddy) . నల్గొండ నుంచి గెలిచిన ఆయనను రేవంత్ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్ల మంచి భావంతోనే ఉంటారు. అటువంటి కోమటిరెడ్డి ఏపీకి వచ్చిన తరుణంలో జగన్మోహన్ రెడ్డికి ఒక విలువైన సలహా ఇచ్చారు. అసెంబ్లీకి హాజరు కావాలని సూచించారు. అంతటితో ఆగకుండా ఏపీ తెలంగాణతో సమానంగా అభివృద్ధి కావాలని ఆకాంక్షించారు. అయితే కోమటిరెడ్డి పది రోజుల ప్రకటనలు గమనిస్తే.. రాజకీయ నేతల మాటలకు, చేతలకు పొంతన ఉండదని అనిపించింది. పవన్ కళ్యాణ్ పై తెలంగాణ నేతల మాటల దాడితో ఏదో జరిగిపోతుందని చాలామంది భావించారు. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెగ సంబరపడిపోయారు. వారి ఆశలపై నీళ్లు చల్లేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.