
AP MLC Elections: ఏపీలో ఎలక్షన్ ఫీవర్ నెలకొంది. ఇంకా ఏడాది వ్యవధి ఉండగానే ఎమ్మెల్సీ రూపంలో ఎన్నికలు రావడంతో అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సెమీ ఫైనల్ గా భావించి సర్వశక్తులూ ఒడ్డాయి. హోరాహోరీగా తలపడ్డాయి. స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే కోటా కింద జరిగే ఎమ్మెల్సీ స్థానాలను వైసీపీ ఏకపక్షంగా గెలిచే చాన్స్ కనిపిస్తోంది. ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలకు మాత్రం పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. మరికొద్ది గంటల్లో విజేలు ఎవరు అనేది తేలుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. అయితే విశాఖ ఉత్తరాంధ్రుల పట్టభద్రుల స్థానం విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలతో పబ్లిక్ పల్స్ ఏంటన్నది తెలిసే అవకాశముంది. వచ్చే ఎన్నికల్లో గెలుపోటములు నిర్థిశించే చాన్స్ ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏపీలో తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 13న ఎన్నిక జరిగింది. మొత్తం 139 మంది బరిలో ఉన్నారు. ఇందులో పట్టభద్రులు 3, ఉపాధ్యాయ స్థానాలు 2, స్థానిక సంస్థలకు సంబంధించి 4 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ రోజు 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. ఇందులో స్థానిక సంస్థల కు సంబంధించి ఫలితాలు వెల్లడయ్యే అవకాశముంది. ఉపాధ్యాయ స్థానాల విజేతలు తేలే చాన్స్ ఉంది. కానీ పట్టభద్రుల ఓట్లు లక్షల్లో ఉండడంతో ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగే అవకాశం ఎక్కువ. ప్రాధాన్యత ఓట్లు బట్టి విజేతలను ప్రకటించే అవకాశముండడంతో అర్ధరాత్రి వరకూ కౌంటింగ్ కొనసాగనుంది. అందుకు తగ్గట్టుగా ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది.
ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ ఉపాధ్యాయ స్థానాలను సైతం విడిచిపెట్టలేదు. ఉద్యోగ, ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు, యువతలో ప్రభుత్వ వ్యతిరేకత ఉందన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ స్థానాలను గెలిచి అధిగమించాలని జగన్ భావించారు. అందుకే తమ పార్టీ బలపరచిన అభ్యర్థులను పోటీలో పెట్టారు. అటు టీడీపీ, లెఫ్ట్ పార్టీల మధ్య పరస్పర అవగాహన జరిగింది. రెండో ప్రాధాన్యత ఓట్లు పంచుకున్నారు. మిత్రపక్షంగా ఉన్న జనసేన బీజేపీకి నేరుగా సపోర్టు చేయలేదు. వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరింతే తప్ప.. పలానా అభ్యర్థికి వేయాలని మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

అయితే ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ స్థానాల ఫలితాలే పబ్లిక్ పల్స్ గా అన్ని పార్టీలు భావిస్తున్నాయి. అయితే సాధారణ ఎన్నికల మాదిరిగా చిత్రవిచిత్రాలు చోటుచేసుకున్నాయి. దొంగ ఓట్లు భారీగా పడ్డాయి. దీనిపై విపక్ష నేత చంద్రబాబుతో పాటు పలు పార్టీల నాయకులు ఆక్షేపించారు. ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. విశాఖ గ్రాడుయేట్ స్థానం నుంచి 37 మంది, కడప, అనంతపురం, కర్నూలు గ్రాడ్యుయేట్ స్థానం నుంచి 49 మంది, ప్రకాశం నెల్లూరు, చిత్తూరు గ్రాడ్యుయేట్ స్థానం నుంచి 22 మంది పోటీలో ఉన్నారు. కడప, అనంతపురం, కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 12 మంది, ప్రకాశం నెల్లూరు, చిత్తూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 8 మంది పోటీలో నిలిచారు. శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఇద్దరు, కర్నూలు స్థానానికి ముగ్గురు, పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరి భవితవ్యం నేడు తేలనుంది. ఒక వేళ వైసీపీ బలపరచిన అభ్యర్థులు ఓటమి చవిచూస్తే మాత్రం జగన్ సర్కారుకు గండమే. విపక్షాలు దూకుడు పెంచే అవకాశముంది. అదే గెలిస్తే మాత్రం జగన్ సర్కారును అడ్డుకునే పరిస్థితే ఉండదు.