CM Jagan: వైసీపీలో అభ్యర్థుల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఏడు జాబితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఎనిమిదో జాబితాను విడుదల చేశారు. రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు, మూడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. ఇకనుంచి మార్పులు ఉండవని జగన్ చెప్పిన 24 గంటల వ్యవధిలోనే.. ఎనిమిదో జాబితా విడుదల కావడం విశేషం. ఇప్పటివరకు దాదాపు 70 మంది సిట్టింగ్లను మార్చిన సంగతి తెలిసిందే. తాజా మార్పుతో ఈ సంఖ్య మరింత పెరిగింది.
పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి గుంటూరుకు కిలారి రోశయ్య, ఒంగోలుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇన్చార్జులుగా ప్రకటించారు. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పొన్నూరుకు అంబటి మురళి, కందుకూరుకు మధుసూదన్ యాదవ్, జీడీ నెల్లూరుకు కృపా లక్ష్మి సమన్వయకర్తలు గా నియమిస్తూ వైసిపి హై కమాండ్ నిర్ణయం తీసుకుంది. ఇందులో కిలారి రోశయ్య పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే.అక్కడ అభ్యర్థిగా అంబటి మురళిని ఖరారు చేశారు. ఆయన మంత్రి అంబటి రాంబాబు సోదరుడు. గతంలో గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఉమ్మారెడ్డి వెంకటరమణ ను నియమించారు.ఇప్పుడు ఆయన స్థానంలో కిలారి రోశయ్య కు అవకాశం కల్పించారు. కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బుర్ర మధుసూదన్ యాదవ్ పేరును ఖరారు చేశారు.
గంగాధర నెల్లూరు వైసిపి అభ్యర్థిని మళ్లీ మార్చారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఉన్నారు. ఆయనకు చిత్తూరు పార్లమెంట్ స్థానానికి పంపించారు. ఆయన పార్లమెంట్ స్థానానికి వెళ్లేందుకు విముఖత చూపడంతో తిరిగి జీడి నెల్లూరు అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు. అయితే ఆయన బదులు కుమార్తె కృపా lలక్ష్మికి టికెట్ కేటాయించారు. మంగళవారం బూత్ స్థాయి పేరిట జరిగిన సమావేశంలో జగన్ మాట్లాడారు. ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఇప్పటివరకు ప్రకటించిన ఇన్చార్జిలే దాదాపు కన్ఫామ్ అవుతారని చెప్పుకొచ్చారు.ఎటువంటి మార్పులు లేని సిట్టింగులు మరోసారి బరిలో దిగుతారని కూడాచెప్పారు. కానీ అనూహ్యంగా ఎనిమిదో జాబితాను విడుదల చేశారు. దీంతో జగన్ భయపడుతున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.