The Point That Journalists Missed: జర్నలిజంలో చాలామంది ఉన్నప్పటికీ.. కొంతమంది మాత్రమే ఆ రంగానికి వన్నె తీసుకొస్తారు. ఇక ఈ కాలంలో కొంతమంది అలాంటివారు ఉన్నారు. తమ దమ్మున్న పాత్రికేయం ద్వారా సరికొత్త గుర్తింపును వారు సొంతం చేసుకున్నారు. అలాంటి వారి నుంచి ఈ సమాజం ఎంతో కొంత న్యూట్రాలిజాన్ని ఆశిస్తుంది.
న్యూట్రిజం పేరుతో ఆ పాత్రికేయులు ఒక పార్టీకి భజన చేయడం.. ఒక వ్యక్తికి డబ్బా కొట్టడం.. ఒక వ్యక్తిని అశేషమైన నాయకుడిగా కీర్తించడమే హాస్యాస్పదంగా కనిపిస్తోంది. వార్తలు చదవడం పేరు. ఫీల్డ్ లెవల్లో వార్తలను సేకరించడం వేరు.. ఒక వ్యక్తిని ముఖాముఖి ప్రశ్నలు అడగడం వేరు. ప్రశ్నలు అడిగే క్రమంలోనే ఒక పాత్రికేయుడిలో ఉన్న పాత్రికేయ తత్వం బయటికి వస్తుంది. అందులో రాగాద్వేషాలకు అతీతంగా ప్రశ్నలు అడిగినప్పుడే అసలు విషయాలు వెలుగు చూస్తాయి. మనదేశంలో తెర వెనుక జరిగిన విషయాలు.. రాజకీయ పార్టీలు పాల్పడిన విధానాలు.. తీసుకున్న నిర్ణయాలు ఇటువంటి ముఖాముఖి చర్చల ద్వారానే బయటికి వచ్చాయి. కానీ ఈ పాత్రికేయులు మాత్రం ముఖాముఖికి అర్థం పూర్తిగా మార్చేశారు. దానిని ఒక భజన తంత్రంగా.. భజన మంత్రంగా చేశారు. తద్వారా ముఖాముఖి అంటే వ్యక్తిగత సోత్కర్షగా మార్చేశారు.
ఇటీవల ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాటు పరిపాలనను విజయవంతంగా పూర్తి చేసుకుంది. కాకపోతే ఇందులో అనేక లోటుపాట్లు ఉన్నప్పటికీ.. మూడు పార్టీల సమ్మేళిత ప్రభుత్వం విజయవంతంగా ఏడాది పాటు పరిపాలన పూర్తి చేసింది. సహజంగా ఈ కూటమిలో తెలుగుదేశం పార్టీ దే పెత్తనం సాగుతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఉన్నారు కాబట్టి.. ప్రభుత్వ పరంగా తీసుకొనే నిర్ణయాలన్నిటికీ ఆయన మాత్రమే బాధ్యుడు. ఇక పథకాల అమలు విషయంలోనూ ప్రభుత్వం కిందా మీదా పడుతోంది. అయితే ఈ విషయాన్ని కూటమి అనుకూల మీడియా అంతగా ప్రజెంట్ చేయడం లేదు. పైగా అందులో ఉన్న పాజిటివిటీని మాత్రమే బయటకు కనిపించేలా చేస్తోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నెగిటివ్ అంశాలను మాత్రమే ఈ మీడియా ప్రజెంట్ చేసింది. కానీ ఇప్పుడు పూర్తిగా పాజిటివ్ గా మారిపోయింది.
Also Read: YSRCP Journalist Comments : అమరావతిలో ఆ టైపు మహిళలు.. వైసిపి జర్నలిస్ట్ సంచలన కామెంట్స్!
ఇక చంద్రబాబుతో ముఖాముఖి నిర్వహించిన ఓవర్గం మీడియా పాత్రికేయులు పూర్తిగా భజనకు అలవాటు పడిపోయారు. చంద్రబాబును అనితర సాధ్యుడిగా.. అసాధ్యుడిగా కీర్తించారు. ఆయనకు మించిన యోధుడు లేడని.. ఆయనకు ఆయనే సాటి అని డబ్బా కొట్టారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలలో చాలామంది అక్రమాలకు పాల్పడుతున్నారు. అవినీతికి పాల్పడుతున్నారు. రకరకాల వ్యవహారాలలో పాలుపంచుకుంటున్నారు.. ఈ మాట అంటున్నది ఎవరో కాదు.. కూటమి అనుకూల మీడియాలోని ఒక ఛానల్. అంతేకాదు ఇటీవల కాలంలో ప్రత్యేకంగా స్టోరీలు కూడా పబ్లిష్ చేస్తోంది. అయినప్పటికీ ఆ మీడియాలో పనిచేసే కొంతమంది మాత్రం ఆ విషయాలను దాచేసి.. మొత్తంగా చంద్రబాబు సేవలోనే తపించి పోయారు. తరించిపోయారు. మరి ఇటువంటి వ్యవహారాలకు పాల్పడుతున్న ఆ మీడియాను న్యూట్రల్ గా ఎలా స్వీకరించాలి.. అందులో పని చేసే పాత్రికేయులను తోపులు అని ఎలా అనుకోవాలి.. తెలుగునాట పాత్రికేయం భ్రష్టు పట్టిపోయిందని చాలామంది విమర్శిస్తుంటే.. బాధగా ఉండేది. కానీ వీరు ఇంటర్వ్యూ చేసిన తీరును చూసిన తర్వాత అది నిజమే అనిపిస్తోంది.