Kondapalli Municipality Election: ఆంధ్ర ప్రదేశ్ లో( Andhra Pradesh) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు టిడిపి కూటమి పరం అవుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీని టిడిపి సొంతం చేసుకుంది. ఉత్కంఠ భరిత పరిస్థితుల నడుమ హైకోర్టు ఆదేశాలతో ఫలితాలను వెల్లడించారు. చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ పదవులను టిడిపి కైవసం చేసుకుంది. అయితే ఇక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీలకు సమానంగా బలం ఉండగా.. ఇండిపెండెంట్ అభ్యర్థి టిడిపికి మద్దతు తెలపడంతో మున్సిపాలిటీ ఆ పార్టీ సొంతం చేసుకుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాకింగ్ పరిణామమే. ఒకవైపు నేతలు పెద్ద ఎత్తున పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. మరోవైపు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అధికారం దూరమవుతోంది.
మూడు పదవులు టిడిపి సొంతం
కొండపల్లి మున్సిపాలిటీ( Kondapalli municipality ) చైర్మన్ గా టిడిపికి చెందిన చెన్నుబోయిన చిట్టిబాబు, వైస్ చైర్మన్లుగా చుట్టుకుదురు శ్రీనివాస్, కరిమకొండ శ్రీలక్ష్మి ఎన్నికయ్యారు. ఈరోజు ఫలితాలను వెల్లడించారు. మొదటినుంచి కొండపల్లి మున్సిపాలిటీ విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు ఫీల్డ్ కవర్ లో తీర్పు ఫలితం వచ్చింది. భారీ బందోబస్తు మధ్య సీల్డ్ కవర్ను తెరిచిన అధికారులు ఫలితాలను ప్రకటించారు. దీంతో గత కొద్ది రోజులుగా కొండపల్లి మున్సిపాలిటీ విషయంలో జరుగుతున్న ఉత్కంఠకు తెరపడింది.
అప్పట్లో కోర్టు వివాదం..
కొండపల్లి మున్సిపాలిటీలు మొత్తం 29 వార్డులు ఉన్నాయి. అందులో చెరి సగం 14 వార్డులను టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నాయి. ఇండిపెండెంట్( independent) ఒకరు విజయం సాధించారు. ఇండిపెండెంట్ అభ్యర్థి టిడిపికి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ బలం 15 కు చేరింది. అయితే అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా వసంత కృష్ణ ప్రసాద్ ఉండేవారు. ఆయన ఎక్స్ అఫీషియో సభ్యుడు కావడంతో వైసీపీకి బలం పెరిగింది. మరోవైపు టిడిపి ఎంపీగా కేసినేని నాని ఉండేవారు. ఆయన సైతం ఎక్స్ అఫీషియో సభ్యుడు. కానీ ఆయన ఓటు పై వివాదం రేగడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోర్టును ఆశ్రయించింది. అయితే సుదీర్ఘ విచారణ తర్వాత తాజాగా ఎక్స్ అఫీషియో సభ్యుడిగా అప్పటి ఎంపి కేసినేని నాని ఓటు చెల్లుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఫీల్డ్ కవర్లో ఆదేశాలు జారీచేసింది. ఈ క్రమంలో టిడిపి బలం 16 కు చేరడంతో ఆ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ ల పదవులను సైతం సొంతం చేసుకుంది.