https://oktelugu.com/

Kasu Mahesh Reddy: నరసరావుపేట వస్తున్న ‘కాసు’కో.. జగన్ నయా ప్లాన్!

కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేస్తున్నారు జగన్( Y S Jagan Mohan Reddy ). టిడిపికి బలమైన నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు.

Written By:
  • Dharma
  • , Updated On : January 13, 2025 / 12:00 PM IST

    Kasu Mahesh Reddy

    Follow us on

    Kasu Mahesh Reddy: ఏపీ రాజకీయాల్లోనే నరసరావుపేట( Narasaraopet ) అసెంబ్లీ స్థానానికి ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోనే రెండో అతిపెద్ద నియోజకవర్గం కూడా. ఇక్కడ నుంచి కాసు బ్రహ్మానందరెడ్డి, కొణిజేటి రోశయ్య, నేదురమల్లి జనార్దన్ రెడ్డి ఎంపీలుగా గెలిచారు. ఢిల్లీలో చక్రం తిప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రులుగా కూడా అయ్యారు. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడు విచిత్రంగా ఉంటాయి. రెడ్డి, కమ్మ, బీసీ, ముస్లిం, ఆర్యవైశ్యులు ఎక్కువగా ఉంటారు. అభ్యర్థుల్లో గెలుపోటముల్లో రైతులు, రైతు కూలీలు, వ్యాపార వర్గాలు, ఉద్యోగ వర్గాలదే ప్రధాన పాత్ర. ఈ ఎన్నికల్లో ఇక్కడ టిడిపి అభ్యర్థి అరవిందబాబు విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి( Gopi Reddy Srinivas Reddy ) ఓడిపోయారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి బలమైన అభ్యర్థిని దింపాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాసు కుటుంబం అయితే ఇక్కడ నెగ్గుకు రాగలదని భావిస్తున్నట్లు సమాచారం.

    * దశాబ్దాల చరిత్ర
    నరసరావుపేట… ఈ మాట చెబితేనే ముందుగా గుర్తొచ్చేది కాసు కుటుంబం( Kasu family ). దశాబ్దాల పాటు నరసరావుపేట కేంద్రంగా రాజకీయం చేసింది ఆ కుటుంబం. కానీ ఉన్నపలంగా ఆ కుటుంబం గురజాల వెళ్లాల్సి వచ్చింది. అయినా సరే తమ మనసంతా నరసరావుపేట పైనే ఉంది. ఈ నేపథ్యంలో జగన్ మరో ఆలోచన చేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత పోస్టుమార్టం చేస్తున్నారు. సమూల ప్రక్షాళనకు దిగారు. నియోజకవర్గ ఇన్చార్జిలను పెద్ద ఎత్తున మార్చుతున్నారు. అందులో భాగంగా నరసరావుపేట బాధ్యతలు కాసు కుటుంబానికి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే నరసరావుపేటలో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయే అవకాశం ఉంది.

    *కాసు కుటుంబానికి కంచుకోట
    కాసు కుటుంబానికి కంచుకోట నరసరావుపేట( Narasaraopet ). ఇక్కడ నుంచి కాసు బ్రహ్మానంద రెడ్డి కేంద్రమంత్రిగా, ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా సేవలు అందించారు. ఆయన వారసుడు కాసు వెంకట కృష్ణారెడ్డి సైతం రెండుసార్లు ఎంపీ అయ్యారు. దశాబ్ద కాలం పాటు రాష్ట్ర మంత్రిగా సేవలందించారు. అయితే కాసు వెంకటకృష్ణారెడ్డి వారసుడు మహేష్ రెడ్డి( Mahesh Reddy) వైసీపీలో చేరారు. గురజాల నియోజకవర్గంలో ఆయనకు టికెట్ సర్దుబాటు చేశారు జగన్. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి మహేష్ రెడ్డి గెలిచారు. కానీ మంత్రి పదవి దక్కలేదు. అయితే ఆయన గురజాల ఎమ్మెల్యే అయినా.. ఎప్పుడు నరసరావుపేట పైనే ఆయన దృష్టి అంతా ఉండేది. ఈ క్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డితో వైరం నడిచేది. అయితే ఈ ఎన్నికల్లో గురజాలలో మహేష్ రెడ్డి ఓడిపోయారు. నరసరావుపేట నుంచి బరిలో దిగిన గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సైతం ఓటమి చవిచూశారు. అయితే వివిధ సమీకరణలో భాగంగా పెద్ద ఎత్తున ఇన్చార్జిలను మారుస్తున్నారు జగన్. అందులో భాగంగా నరసరావుపేట తెరపైకి కాసు కుటుంబాన్ని తెస్తున్నట్లు సమాచారం. దశాబ్దాలుగా ఇక్కడ కాసు కుటుంబం రాజకీయం చేయడంతో.. వచ్చే ఎన్నికల్లో నెగ్గుకు రాగలరని జగన్ భావిస్తున్నారు.

    * సంక్రాంతి తర్వాత కీలక నిర్ణయం
    సంక్రాంతి తర్వాత నరసరావుపేట నియోజకవర్గ ఇన్చార్జిగా కాసు మహేష్ రెడ్డి( Kasu Mahesh Reddy ) పేరు ఖరారు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన అరవింద్ బాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. అందుకే రెడ్డి సామాజిక వర్గంలో బలమైన కుటుంబ నేపథ్యం ఉన్న కాసు కుటుంబాన్ని బరిలో దించితే వర్కౌట్ అవుతుందని జగన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికీ నరసరావుపేట ప్రజలు కాసు బ్రహ్మానందరెడ్డి సేవలను గుర్తు చేసుకుంటారు. ఆయన మనుమడు మహేష్ రెడ్డి బరిలో దిగితే మాత్రం ఇక్కడ వార్ వన్ సైడేనని తెలుస్తోంది. ఇప్పటికే కాసు కుటుంబానికి స్పష్టమైన సమాచారం ఉందని.. ఈ క్షణంలోనైనా ఆయన పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.